Bengaluru Stampede: సెలబ్రేషన్స్ కన్నా ప్రాణాలే ముఖ్యం.. బెంగుళూరు ఘటనపై గంభీర్ తీవ్ర హెచ్చరిక
Bengaluru Stampede: బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ విజయ పరేడ్‌కు ముందు జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
Bengaluru Stampede: సెలబ్రేషన్స్ కన్నా ప్రాణాలే ముఖ్యం.. బెంగుళూరు ఘటనపై గంభీర్ తీవ్ర హెచ్చరిక
Bengaluru Stampede: బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ విజయ పరేడ్‌కు ముందు జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఆర్‌సిబిపై కేసు కూడా నమోదైంది. ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ విషయంపై పెద్ద ప్రకటన చేశారు. గంభీర్ మాట్లాడుతూ, విజయాల తర్వాత ఇలాంటి రోడ్ షోలు అస్సలు ఉండకూడదని అన్నారు. ఎందుకంటే.. "ఉత్సవాల కన్నా ప్రాణాలే ముఖ్యం" అని ఆయన గట్టిగా చెప్పారు. మీడియా సమావేశంలో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. "నాకు రోడ్ షోలపై అస్సలు నమ్మకం లేదు. నేను ఆడుతున్నప్పుడు, మేము టీ20 ప్రపంచ కప్ గెలిచినప్పుడు కూడా నేను ఈ రోడ్ షోకు మద్దతు ఇవ్వలేదు. ప్రజల ప్రాణాలు చాలా ముఖ్యం. బెంగళూరులో జరిగిన సంఘటన చాలా బాధాకరం" అని అన్నారు.
బెంగళూరు ఐపీఎల్ 2025 టైటిల్ గెలుచుకున్నప్పుడు అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. బెంగళూరులోని విధానసౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు విజయ పరేడ్ నిర్వహించాల్సి ఉంది. అయితే వేలాది మంది అభిమానులు గుమిగూడారు. వారిని కంట్రోల్ చేయడం కష్టమైంది. ఒక చోట పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 11 మంది మరణించారు. ఈ ప్రమాదంపై న్యాయ విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. అంతేకాకుండా, ఆర్‌సిబిపై కూడా ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయడం గమనార్హం. ఈ ప్రమాదం జరిగిన తర్వాత కూడా చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సిబి ఆటగాళ్లను సత్కరించడంపై ప్రశ్నలు తలెత్తాయి. అయితే, తరువాత విరాట్ కోహ్లీతో సహా ఆర్‌సిబి జట్టు మొత్తం ఈ ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేసింది.
గంభీర్ మీడియాతో జస్‌ప్రీత్ బుమ్రా అంశంపై కూడా తన అభిప్రాయాలను పంచుకున్నారు. బుమ్రా ఇంగ్లండ్ పర్యటనలో ఏ మూడు టెస్టులు ఆడతారని అడిగిన ప్రశ్నకు భారత కోచ్ స్పందిస్తూ, ఆ నిర్ణయం ఇంకా తీసుకోలేదని అన్నారు. సిరీస్ పరిస్థితిని బట్టి ఈ నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. "మాకు నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా టీమిండియా బుమ్రా లేకుండానే మంచి ప్రదర్శన చేయగల సత్తాను చూపింది. ఈసారి కూడా అదే చేయాలి" అని గంభీర్ అన్నారు. ఇంగ్లండ్ పర్యటనలో యువ ఆటగాళ్లకు అద్భుతమైన ప్రదర్శన చేసే పూర్తి అవకాశం ఉందని గౌతమ్ గంభీర్ నొక్కి చెప్పారు. ఇది జట్టులో యంగ్ టాలెంట్ ప్రోత్సహించడం తమ వ్యూహంలో భాగమని ఆయన స్పష్టం చేశారు.