IPL 2026: రాజస్థాన్ రాయల్స్ సంచలన నిర్ణయం.. జైపూర్‌కు గుడ్ బై! కొత్త ‘హోమ్ గ్రౌండ్’ ఫిక్స్!
ఐపీఎల్ 2026కు ముందు రాజస్థాన్ రాయల్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా తమ సొంత మైదానం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంకు గుడ్ బై చెప్పి, పుణెలోని MCA స్టేడియాన్ని కొత్త హోమ్ గ్రౌండ్‌గా ఎంచుకుంది. సంజూ శాంసన్ ట్రేడ్ తర్వాత జట్టులో జరుగుతున్న ఈ భారీ మార్పులు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌కు ముందే రాజస్థాన్ రాయల్స్ (RR) అభిమానులకు ఒక మింగుడుపడని వార్త బయటకు వచ్చింది. ఐపీఎల్ ఆరంభం (2008) నుంచి తమకు అండగా నిలిచిన రాజస్థాన్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం (SMS) కు రాయల్స్ యాజమాన్యం గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుంది. రాబోయే సీజన్ నుండి తమ హోమ్ మ్యాచ్‌లను మరో నగరంలో నిర్వహించేందుకు సిద్ధమైంది.
పుణె వేదికగా రాయల్స్ సందడి!
తాజా సమాచారం ప్రకారం, ఐపీఎల్ 2026 కోసం రాజస్థాన్ రాయల్స్ పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (MCA) స్టేడియాన్ని తమ కొత్త హోమ్ గ్రౌండ్‌గా ఎంచుకుంది. ఇప్పటికే రాయల్స్ ఆపరేషన్స్ టీమ్ పుణెను సందర్శించి.. అక్కడి పిచ్, వసతులు, రవాణా సౌకర్యాలను పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
గతంలో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ఈ స్టేడియం వేదికగా నిలిచింది. కాగా, అస్సాంలోని గువాహటి స్టేడియం యథావిధిగా రెండో హోమ్ గ్రౌండ్‌గా కొనసాగనుంది.
ఎందుకు ఈ మార్పు?
జైపూర్‌లోని SMS స్టేడియంలో భద్రతా పరమైన లోపాలు ఉన్నాయని రాయల్స్ యాజమాన్యం చాలా కాలంగా అసంతృప్తితో ఉంది. దీనిపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా ఆశించిన స్పందన రాలేదు. స్టేడియం పునరుద్ధరణ పనులపై కూడా స్పష్టత లేకపోవడంతో, ఫ్యాన్స్‌కు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వేదికను మార్చాలని నిర్ణయించుకుంది.
రేసులో ఆర్సీబీ ఉన్నా.. రాయల్స్‌కే ఛాన్స్!
పుణె స్టేడియం కోసం రాయల్ బాయ్స్‌తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కూడా ప్రయత్నించినట్లు టాక్. అయితే చివరి నిమిషంలో రాజస్థాన్ రాయల్స్ ఈ వేదికను దక్కించుకున్నట్లు సమాచారం. ఇది జైపూర్ అభిమానులకు షాక్ ఇచ్చే విషయమే అయినప్పటికీ, మెరుగైన వసతుల కోసమే ఈ నిర్ణయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
జడేజా రాక.. కెప్టెన్ ఎవరు?
ఈ ఏడాది మెగా వేలానికి ముందే రాజస్థాన్ జట్టులో భారీ మార్పులు జరిగాయి. జట్టు కెప్టెన్ సంజూ శాంసన్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌కు ట్రేడ్ చేసి, స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను జట్టులోకి తెచ్చుకుంది. అయితే, 2026 సీజన్‌లో జట్టును ఎవరు నడిపిస్తారనే అంశంపై మేనేజ్‌మెంట్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.