IND vs NZ 2nd ODI : కేఎల్ రాహుల్ సెంచరీ వృథా..కివీస్ దెబ్బకు భారత్ విలవిల

IND vs NZ 2nd ODI : భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో వన్డే పోరులో కివీస్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Update: 2026-01-15 03:13 GMT

IND vs NZ 2nd ODI : కేఎల్ రాహుల్ సెంచరీ వృథా..కివీస్ దెబ్బకు భారత్ విలవిల

IND vs NZ 2nd ODI : భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో వన్డే పోరులో కివీస్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్, కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీతో 284 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఏమాత్రం తడబడకుండా 47.3 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. డారిల్ మిచెల్ సెంచరీతో భారత్ నోటికాడ విజయాన్ని దూరం చేశాడు. ఈ విజయంతో సిరీస్ ఫలితం ఇప్పుడు నిర్ణయాత్మకమైన మూడో వన్డేపై ఆధారపడి ఉంది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే నిరాశ ఎదురైంది. స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మంచి ఆరంభాన్ని పొందినప్పటికీ, వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 56 పరుగులతో రాణించగా, శ్రేయస్ అయ్యర్ మరోసారి నిరాశపరిచాడు. ఈ క్లిష్ట సమయంలో కేఎల్ రాహుల్ జట్టును ఆదుకున్నాడు. ఒంటరి పోరాటం చేస్తూ అజేయంగా 112 పరుగులు చేసి తన వన్డే కెరీర్‌లో 8వ సెంచరీని నమోదు చేశాడు. రాహుల్ మెరుపుల వల్లే భారత్ 284 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగింది.

285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు భారత బౌలర్లు మొదట్లో షాక్ ఇచ్చారు. 50 పరుగుల లోపే రెండు వికెట్లు తీసి టీమిండియా పైచేయి సాధించినట్లు కనిపించింది. అయితే, ఇక్కడే అసలు కథ మొదలైంది. డారిల్ మిచెల్, విల్ యంగ్ జోడీ భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టింది. వీరిద్దరూ ఏకంగా 162 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను భారత్ నుండి లాగేసుకున్నారు. విల్ యంగ్ 87 పరుగుల వద్ద అవుట్ అయినప్పటికీ, మిచెల్ మాత్రం తగ్గలేదు. 117 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 131 పరుగులు చేసి కివీస్‌ను విజయతీరాలకు చేర్చాడు.

భారత బౌలింగ్ ఈ మ్యాచ్‌లో తేలిపోయింది. ముఖ్యంగా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దారుణంగా విఫలమయ్యాడు. ఒక వికెట్ తీసినప్పటికీ, 10 ఓవర్లలో ఏకంగా 82 పరుగులు సమర్పించుకున్నాడు. ప్రసీద్ కృష్ణ, హర్షిత్ రాణాలు తలో వికెట్ తీసినా పరుగులను నియంత్రించలేకపోయారు. దీంతో కివీస్ బ్యాటర్లు ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేరుకున్నారు. సిరీస్ ఇప్పుడు 1-1తో సమానం కావడంతో, విజేతను నిర్ణయించే ఆఖరి వన్డే జనవరి 18న ఇండోర్ వేదికగా జరగనుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే సిరీస్ దక్కుతుంది.

Tags:    

Similar News