Vaibhav Suryavanshi: ఏంటి తమ్ముడు ఈ రచ్చ? అశ్విన్ ప్రశంసల వర్షం!

14 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ విధ్వంసంపై రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు. ఐపీఎల్ 2026 అప్‌డేట్స్ మరియు అండర్-19 వరల్డ్ కప్ వివరాలు.

Update: 2026-01-09 05:30 GMT

భారత క్రికెట్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే పేరు వినిపిస్తోంది.. ఆయనే 14 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ! అండర్-19 వరల్డ్ కప్‌నకు ముందు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వైభవ్ ఆడుతున్న తీరు చూసి దిగ్గజాలే నోరెళ్లబెడుతున్నారు. తాజాగా టీమిండియా స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, వైభవ్ బ్యాటింగ్‌పై నెట్టింట పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.

‘ఏంటి తమ్ముడు ఈ డోస్?’

గత 30 రోజుల్లో వైభవ్ నమోదు చేసిన స్కోర్లను (71, 50, 190, 68, 108*, 46, 127) ప్రస్తావిస్తూ అశ్విన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. "ఏంటి తమ్ముడు.. ఈ శాంపిల్ సరిపోతుందా? లేక డోస్ ఇంకా పెంచుతావా?" అంటూ సరదాగా ట్వీట్ చేశాడు. 14 ఏళ్లకే ఇంతటి పరిణతితో, భారీ హిట్టింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను వణికించడం అద్భుతమని అశ్విన్ కొనియాడాడు.

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ ‘ట్రంప్ కార్డ్’

గత ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున అరంగేట్రం చేసిన వైభవ్, గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు.

రిటెన్షన్: ఐపీఎల్ 2026 కోసం రాజస్థాన్ రాయల్స్ ఈ కుర్రాడిని రూ. 1.10 కోట్లకు రిటైన్ చేసుకుంది.

భారీ నిర్ణయం: వైభవ్‌పై నమ్మకంతోనే రాజస్థాన్ యాజమాన్యం సంజూ శాంసన్ వంటి స్టార్ ప్లేయర్‌ను వదులుకుని, వైభవ్‌ను ఓపెనర్‌గా ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అండర్-19 వరల్డ్ కప్‌పై కన్ను

ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో జరుగుతున్న యూత్ వన్డేల్లో వైభవ్ కేవలం 63 బంతుల్లోనే శతక్కొట్టి తన ఫామ్‌ను నిరూపించుకున్నాడు. రానున్న అండర్-19 ప్రపంచ కప్‌లో వైభవ్ టీమిండియాకు ప్రధాన ఆయుధం కానున్నాడు. వచ్చే నాలుగు నెలల పాటు ఈ యువ ఆటగాడి బ్యాటింగ్ చూసేందుకు తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని అశ్విన్ పేర్కొన్నాడు.

Tags:    

Similar News