India U19 : కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ తొలి సిరీస్‌లోనే జైత్రయాత్ర..క్లీన్ స్వీప్‌తో వరల్డ్ కప్ వార్నింగ్!

India U19 : దక్షిణాఫ్రికా గడ్డపై భారత కుర్రాళ్లు విశ్వరూపం ప్రదర్శించారు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసి సఫారీలను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించారు.

Update: 2026-01-08 02:46 GMT

India U19 : దక్షిణాఫ్రికా గడ్డపై భారత కుర్రాళ్లు విశ్వరూపం ప్రదర్శించారు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసి సఫారీలను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించారు. బెనోనిలోని విల్లోమూర్ పార్క్ వేదికగా జరిగిన చివరి పోరులో టీమిండియా అండర్-19 జట్టు అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించి ఘన విజయాన్ని అందుకుంది. కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌లోనే వైభవ్ సూర్యవంశీ క్లీన్ స్వీప్ విజయాన్ని అందుకోవడం విశేషం.

తొలి రెండు వన్డేలు గెలిచి ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత అండర్-19 జట్టు, మూడో మ్యాచ్‌లోనూ అదే దూకుడును కొనసాగించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు కలలో కూడా ఊహించని ఆరంభాన్ని ఇచ్చారు. నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 393 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్ సెంచరీలతో విరుచుకుపడి సఫారీ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు.

కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ కేవలం 74 బంతుల్లోనే 127 పరుగులు బాది క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ ఆరోన్ జార్జ్ 118 పరుగులతో అండగా నిలిచాడు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 227 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారీ స్కోరుకు పునాది వేశారు. అనంతరం వచ్చిన వేదాంత్ త్రివేది (34), మహ్మద్ ఎనాన్ (28) కీలక పరుగులు జోడించడంతో భారత్ దాదాపు 400 పరుగుల మార్కును తాకింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఎన్.సోని 3 వికెట్లు పడగొట్టినప్పటికీ, భారత బ్యాటర్లను అడ్డుకోవడంలో విఫలమయ్యారు.

394 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు ఆదిలోనే చుక్కలు కనిపించాయి. భారత బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడటంతో సఫారీలు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయారు. ముఖ్యంగా కిషన్ సింగ్ తన స్పెల్‌తో సంచలనం సృష్టించాడు. కేవలం 4 ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి వెన్ను విరిచాడు. సఫారీ బ్యాటర్లలో పాల్ జేమ్స్ (41), డానియల్ బోస్మాన్ (40) పోరాడినప్పటికీ జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు.

చివరికి దక్షిణాఫ్రికా జట్టు 35 ఓవర్లలో 160 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 233 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. బౌలింగ్‌లో కిషన్ సింగ్‌తో పాటు మహ్మద్ ఎనాన్ 2 వికెట్లు తీయగా.. హేనిల్ పటేల్, కనిష్క్ చౌహాన్, ఉద్ధవ్ మోహన్, ఆర్.ఎస్.అంబరీష్, కెప్టెన్ వైభవ్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ విజయంతో అండర్-19 వరల్డ్ కప్‌కు ముందు టీమిండియా తన బలాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.

Tags:    

Similar News