Jasprit Bumrah : మలింగ రికార్డు కనుమరుగు..టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే నంబర్ 1 బౌలర్ గా బుమ్రా
Jasprit Bumrah : టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో బుమ్రా 15 పరుగులకే 4 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. మలింగ రికార్డును అధిగమించి అత్యధిక వికెట్లు తీసిన పేసర్ గా నిలిచాడు.
Bumrah Magic in T20 WC
Jasprit Bumrah : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరులో జస్ప్రీత్ బుమ్రా మరోసారి తన బౌలింగ్ మాయాజాలాన్ని ప్రదర్శించి జస్సీ జైసా కోయి నహీ (బుమ్రా లాంటి వారు ఎవరూ లేరు) అని నిరూపించుకున్నాడు. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై భారత్ 255 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ, కివీస్ బ్యాటర్లు ఆ లక్ష్యాన్ని ఛేదించకుండా బుమ్రా తన పదునైన బంతులతో కట్టడి చేశాడు. ఈ చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా, తన 4 ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి కివీస్ నడ్డి విరిచాడు.
వరల్డ్ నంబర్ 1 బౌలర్‌గా బుమ్రా
ఈ టోర్నీలో బుమ్రా ప్రదర్శన అద్భుతం అనే చెప్పాలి. మొత్తం 8 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టి టోర్నీలోనే బెస్ట్ బౌలర్‌గా నిలిచాడు. వరుణ్ చక్రవర్తి కూడా 14 వికెట్లు తీసినప్పటికీ, బుమ్రా ఎకానమీ రేట్ (6.2) చాలా తక్కువగా ఉండటంతో అతనే అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, జేమ్స్ నీషమ్, మ్యాట్ హెన్రీ వంటి కీలక వికెట్లను తీసి న్యూజిలాండ్ ఆశలపై నీళ్లు చల్లాడు. ప్రతి ఓవర్‌కు సగటున 3.8 పరుగులు మాత్రమే ఇచ్చి బ్యాటర్లను ఊపిరి తీసుకోనివ్వలేదు.
చరిత్ర సృష్టించిన రికార్డులు
ఈ మ్యాచ్‌తో బుమ్రా రెండు భారీ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో 39 వికెట్లు తీసిన బుమ్రా.. లసిత్ మలింగ, అన్రిచ్ నోర్జే వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టేశాడు. అంతేకాకుండా టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో 4 వికెట్లు తీసిన మొట్టమొదటి ఫాస్ట్ బౌలర్‌గా కూడా అరుదైన ఘనత సాధించాడు.
స్లోయర్ బంతులే ఆయుధాలు
బుమ్రా ఈ టోర్నీలో తన మేధస్సును ప్రదర్శించి 14 వికెట్లలో 6 వికెట్లను కేవలం స్లోయర్ బంతులతోనే సాధించాడు. సెమీఫైనల్‌లో హ్యారీ బ్రూక్‌ను, ఫైనల్‌లో రచిన్ రవీంద్రను తొలి బంతికే అవుట్ చేసి భారత్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. తన హోమ్ గ్రౌండ్‌లో గతంలో ఒక ఫైనల్ ఓడిపోయిన బాధను, నేడు ఛాంపియన్‌గా నిలిచి చెరిపివేసుకున్నానని బుమ్రా ఎమోషనల్ అయ్యాడు. అనుభవం నుంచి నేర్చుకుని, వేగం కంటే తెలివితేటలతో బౌలింగ్ చేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న తర్వాత బుమ్రా చెప్పుకొచ్చాడు.