IPL 2026: బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం
Bangladesh Bans IPL Broadcast: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (IPL 2026) ప్రారంభానికి ముందే భారత్-బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ యుద్ధం మొదలైంది.
Bangladesh Bans IPL Broadcast: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (IPL 2026) ప్రారంభానికి ముందే భారత్-బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ యుద్ధం మొదలైంది. ఐపీఎల్ ప్రసారాలను తమ దేశంలో నిలిపివేస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు నుంచి బంగ్లా స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తప్పించడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రూ. 9.20 కోట్ల భారీ ధరకు కేకేఆర్ దక్కించుకుంది. అయితే, బంగ్లాదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో అతడిని జట్టులో కొనసాగించడంపై భారత్‌లో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ముస్తాఫిజుర్‌ను రిలీజ్ చేయాలని బీసీసీఐ కేకేఆర్ ఫ్రాంచైజీని ఆదేశించింది. బోర్డు ఆదేశాలతో కేకేఆర్ అతడిని జట్టు నుంచి తప్పించింది.
బీసీసీఐ నిర్ణయాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. ఎటువంటి సరైన కారణం లేకుండా తమ దేశ అగ్రశ్రేణి ఆటగాడిని తొలగించడం బంగ్లా ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ఆ దేశ ప్రభుత్వం పేర్కొంది. "తదుపరి నోటీసు వచ్చే వరకు బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారాలను తక్షణమే నిలిపివేయాలి" అని సమాచార శాఖ ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు వచ్చే నెలలో భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026 పై కూడా బంగ్లాదేశ్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ జట్టు భారత్‌లో ఆడటం క్షేమకరం కాదని, బంగ్లాదేశ్ ఆడే మ్యాచ్‌లను భారత్ వెలుపల నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) విజ్ఞప్తి చేసింది. మార్చి 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ దౌత్యపరమైన మరియు క్రీడాపరమైన వివాదం ఎటు దారితీస్తుందోనని క్రీడా ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.