Australia Squad: టీ20 వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా టీమ్ ప్రకటన.. కమిన్స్ ఔట్, సర్‌ప్రైజ్ ఎంట్రీ!
Australia Squad: ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ 2026 కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) శనివారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
Australia Squad: ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ 2026 కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) శనివారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీలో ఆసీస్ కెప్టెన్‌గా మిచెల్ మార్ష్ వ్యవహరించనున్నాడు. స్టార్ పేసర్, టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెన్ను గాయం కారణంగా వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడు. కమిన్స్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకా సమయం పట్టనుండడంతో.. సెలెక్టర్లు అతడి స్థానంలో బెన్ ద్వార్షుయిస్‌ను జట్టులోకి ఎంపిక చేశారు. ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ టోనీ డోడెమైడ్బె మాట్లాడుతూ... 'లెఫ్ట్ ఆర్మ్ పేస్‌తో పాటు అద్భుతమైన ఫీల్డింగ్, చివరి ఓవర్లలో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం బెన్ ద్వార్షుయిస్ సొంతం. ఆసియా పరిస్థితుల్లో అతడి స్వింగ్, వేరియేషన్స్ చాలా ఉపయోగపడతాయి' అని తెలిపారు.
ఇటీవల పాకిస్థాన్‌తో టీ20ల్లో అరంగేట్రం చేసిన మాజీ టెస్ట్ ఓపెనర్ మ్యాట్ రేన్‌షాకు సర్‌ప్రైజ్‌గా చోటు దక్కింది. గాయపడిన మ్యాట్ షార్ట్కు ప్రత్యామ్నాయంగా రేన్‌షాను ఆసీస్ సెలెక్టర్లు ఎంపిక చేశారు. అన్ని ఫార్మాట్లలో రేన్‌షా ఇటీవల అద్భుతంగా రాణిస్తున్నాడని, వైట్ బాల్ క్రికెట్‌లో విభిన్న పాత్రల్లో నిరూపించుకున్నాడని సెలెక్టర్లు పేర్కొన్నారు. శ్రీలంకలో గ్రూప్ దశల్లో స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌లు ఉండనున్న నేపథ్యంలో మిడిల్ ఆర్డర్‌కు అదనపు బలం అవసరమని భావించినట్లు డోడెమైడ్ వెల్లడించారు. రేన్‌షా మిడిల్ ఆర్డర్‌కు కీలకంగా మారతాడని అన్నారు. ఎడమచేతి బ్యాట్స్‌మన్ కావడం కూడా జట్టుకు ప్రయోజనమని స్పష్టం చేశారు.
ఆశ్చర్యకరంగా,ఇటీవల బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ తరఫున 41 బంతుల్లో సెంచరీ చేసిన స్టీవ్ స్మిత్, అలాగే గత టీ20 వరల్డ్‌కప్‌లో ఆడిన మిచెల్ స్టార్క్ లకు ఆసీస్ జట్టులో చోటు దక్కలేదు. ఇది ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. కీలక పేసర్లు స్టార్క్, కమిన్స్ లేకపోవడంతో ఆసీస్ జట్టుకు ప్రతికూలమే కానుంది. ప్రత్యర్థి జట్లకు మాత్రం ఇది ఓ శుభవార్త అనే చెప్పాలి. ఆసీస్ పేస్ విభాగంను జోష్ హేజిల్‌వుడ్ నడిపించనున్నాడు. బెన్ ద్వార్షుయిస్, కామెరూన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్ అతడికి అండగా ఉండనున్నారు. అయితే ఆసీస్ బ్యాటింగ్ మాత్రం బలంగా ఉంది. మిచెల్ మార్ష్, టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్ లాంటి హిట్టర్స్ జట్టులో ఉన్నారు.
టీ20 వరల్డ్‌కప్ 2026 కోసం ఆస్ట్రేలియా జట్టు:
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కానెల్లీ, టిమ్ డేవిడ్, బెన్ ద్వార్షుయిస్, కామెరూన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కూనెమన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మ్యాథ్యూ రేన్‌షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.