Arshdeep Singh : 2 ఓవర్లలో 40 రన్స్.. ఆపై 5 వికెట్ల ఊచకోత.. అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డ్

2 ఓవర్లలో 40 రన్స్.. ఆపై 5 వికెట్ల ఊచకోత.. అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డ్

Update: 2026-02-01 02:27 GMT

Arshdeep Singh : టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు టీమిండియా స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ తన బౌలింగ్ పవర్‌తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో ఆరంభంలో భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ, అద్భుతమైన రీతిలో పుంజుకుని ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో భారత్ 46 పరుగుల తేడాతో విజయం సాధించడమే కాకుండా, సిరీస్‌ను 4-1తో సొంతం చేసుకుంది.

తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్ ప్రేక్షకులకు అసలైన వినోదాన్ని అందించింది. భారత్ నిర్దేశించిన 272 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఆరంభంలో రెచ్చిపోయి ఆడింది. ముఖ్యంగా ఫిన్ అలెన్ దాడికి భారత బౌలర్లు బెంబేలెత్తిపోయారు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన మొదటి రెండు ఓవర్లలోనే ఏకంగా 40 పరుగులు వచ్చాయి. పవర్‌ప్లేలో అర్ష్‌దీప్ ధారాళంగా పరుగులు ఇస్తుంటే.. మ్యాచ్ భారత్ చేజారిపోతుందేమో అని అభిమానులు ఆందోళన చెందారు.

అయితే, అసలైన మలుపు 12వ ఓవర్‌లో మొదలైంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మళ్లీ అర్ష్‌దీప్‌కు బంతిని అప్పగించగా.. ఈసారి ఆయన తన పదునైన వ్యూహంతో కివీస్ బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. ఆ ఓవర్ మొదటి బంతికే ప్రమాదకరమైన రచిన్ రవీంద్రను అవుట్ చేయడమే కాకుండా, అదే ఓవర్‌లో కెప్టెన్ మిచెల్ సాంట్నర్‌ను డకౌట్ చేసి కివీస్ ఆశలపై నీళ్లు చల్లాడు. కేవలం ఒకే ఓవర్‌లో రెండు కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు.

ఇక 16వ ఓవర్‌లో అర్ష్‌దీప్ తన విశ్వరూపం చూపించాడు. క్రీజులో పాతుకుపోయిన డారిల్ మిచెల్, కైల్ జేమీసన్ వికెట్లను తీసి తన కెరీర్‌లో మొదటి టీ20 ఇంటర్నేషనల్ ఫైవ్ వికెట్ హాల్‎ను పూర్తి చేశాడు. మొత్తంగా 4 ఓవర్లలో 51 పరుగులు ఇచ్చినప్పటికీ, 5 కీలక వికెట్లు తీసి కివీస్ పతనాన్ని శాసించాడు. భారత్ తరపున టీ20ల్లో ఐదు వికెట్లు తీసిన ఆరో బౌలర్‌గా అర్ష్‌దీప్ చరిత్ర సృష్టించాడు. ఈ విజయంతో భారత్ సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుని, వరల్డ్ కప్ ప్రిపరేషన్స్‌లో తామెంత బలంగా ఉన్నామో నిరూపించుకుంది.

Tags:    

Similar News