Basant Panchami 2026: పిల్లల చదువుల్లో రాణించాలంటే.. ఈ రోజే 'సరస్వతి వందనం' చేయించండి!
2026 వసంత పంచమి వేడుకలు జనవరి 23న జరగనున్నాయి. ఈ పవిత్ర దినాన విద్యార్థులు సరస్వతీ దేవిని ఎలా ప్రార్థించాలి? పిల్లల ఏకాగ్రతను పెంచే శ్లోకాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
జ్ఞానానికి అధిదేవత, సకల కళల తల్లి అయిన సరస్వతీ దేవి జన్మించిన పవిత్ర దినమే వసంత పంచమి. ప్రతి ఏటా మాఘ మాసం శుక్ల పక్ష పంచమి తిథి నాడు ఈ పండుగను జరుపుకుంటాం. ఈ ఏడాది జనవరి 23, 2026 (శుక్రవారం) నాడు వసంత పంచమి లేదా శ్రీపంచమిని జరుపుకోబోతున్నాం. ఈ రోజు నుంచే ప్రకృతిలో కొత్త కాంతులు నింపుతూ వసంత రుతువు కూడా ప్రారంభమవుతుంది.
సరస్వతీ కటాక్షం ఎందుకు ముఖ్యం?
విద్యార్థులు, కళాకారులు, మేధావులు జ్ఞానాన్ని, వివేకాన్ని, సద్బుద్ధిని ప్రసాదించమని ఈ రోజు అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు. చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయడానికి ఈ రోజు అత్యంత ప్రశస్తమైనది. తెల్లని వస్త్రాలు ధరించి, శ్వేత పద్మంపై వీణను ధరించిన వాగ్దేవిని స్తుతిస్తే అజ్ఞానం తొలగి, బుద్ధి వికాసం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
విద్యార్థులు పఠించాల్సిన ముఖ్యమైన 'సరస్వతి వందనం'
ఈ రోజు పిల్లల చేత ఈ క్రింది శక్తివంతమైన శ్లోకాలను పఠింపజేయడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయని భక్తుల నమ్మకం:
1. సరస్వతీ ప్రార్థన శ్లోకం:
యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రావృతా | యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా || యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా | సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా ||
తాత్పర్యం: మల్లెపూవు, చంద్రుడు, మంచు హారం వలె తెల్లగా మెరిసేది.. శ్వేత పద్మంపై ఆసీనురాలై, బ్రహ్మ విష్ణు మహేశ్వరులచే నిత్యం పూజించబడే ఓ చదువుల తల్లి! మాలోని అజ్ఞానాన్ని తొలగించి మమ్మల్ని రక్షించు.
2. విద్యారంభ శ్లోకం:
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి | విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||
అగస్త్య మహర్షి ప్రోక్త 'సరస్వతీ స్తోత్రం' (ముఖ్య భాగాలు):
సరస్వతి దేవిని నిత్యం స్తుతించే ఈ స్తోత్రం అపారమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది:
సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః | శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః ||
నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః | విద్యాధరే విశాలాక్షి శుద్ధజ్ఞానే నమో నమః ||
జ్ఞాన విజ్ఞాన రూపాయై జ్ఞానమూర్తే నమో నమః | నానాశాస్త్ర స్వరూపాయై నానారూపే నమో నమః ||
ఫలితం: ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఈ స్తోత్రాన్ని పఠించే వారికి ఆరు నెలల్లోనే జ్ఞాన సిద్ధి కలుగుతుందని, చోర, వ్యాఘ్ర భయాలు ఉండవని అగస్త్య ముని చెప్పారు.