Insta Uncle: బుల్లెట్ దిగింది! 70 ఏళ్ల వయసులో ఇన్‌స్టా ఎంట్రీ.. తొలి వ్లాగ్‌తోనే 2 కోట్ల వ్యూస్ కొల్లగొట్టిన 'అంకుల్'
Insta Uncle: "ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యం" అనే 'పోకిరి' సినిమా డైలాగ్ ఇప్పుడు ఒక పెద్దాయనకు సరిగ్గా సరిపోతుంది.
Insta Uncle: "ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యం" అనే 'పోకిరి' సినిమా డైలాగ్ ఇప్పుడు ఒక పెద్దాయనకు సరిగ్గా సరిపోతుంది. డెబ్బై ఏళ్ల వయసులో సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన ఆయన, కేవలం ఒక్కటంటే ఒక్క వీడియోతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నారు. ఇన్‌స్టా వేదికగా ఆయన చేసిన తొలి వ్లాగ్ ఇప్పుడు గ్లోబల్ వైడ్‌గా వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన 70 ఏళ్ల వినోద్ కుమార్ శర్మ ఇటీవల 'ఇన్‌స్టా అంకుల్' పేరుతో ఒక పేజీని ప్రారంభించారు. రిటైర్మెంట్ తర్వాత ఖాళీగా ఉండలేక, సమయాన్ని అర్థవంతంగా గడపాలని ఆలోచించి వ్లాగింగ్ వైపు అడుగులు వేశారు.
ఆయన పోస్ట్ చేసిన మొదటి వీడియోలో ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేవు. కేవలం ఆయన అమాయకత్వం, నిజాయితీ నెటిజన్లను కట్టిపడేశాయి. "నా పేరు వినోద్ కుమార్ శర్మ. నాకు వ్లాగులు చేయడం రాదు, కానీ ప్రయత్నిస్తున్నాను. నా ఈ ప్రయత్నం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను" అంటూ ఆయన చెప్పిన మాటలు నెటిజన్ల మనసు గెలుచుకున్నాయి.
ఈ వీడియో పోస్ట్ చేసిన కేవలం రెండు రోజుల్లోనే 2.2 కోట్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. ఒకే ఒక్క వ్లాగ్‌తో ఆయన ఫాలోవర్ల సంఖ్య 64 వేలకు పైగా పెరగడం విశేషం. ఈ వీడియో చూసిన నెటిజన్లు "వయసు అనేది కేవలం అంకె మాత్రమేనని మీరు నిరూపించారు అంకుల్" అంటూ కామెంట్లతో ఆయన్ను ప్రోత్సహిస్తున్నారు. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకునే వారికి శర్మ ఒక పెద్ద స్ఫూర్తిగా నిలుస్తున్నారు.