హోలీని అద్వితీయంగా జరుపుకుంటున్న ఆదివాసీలు.. వెల్లిగోగు పూలతో...

Holi 2022: పండుగ రోజు పొలాల్లో ప్రత్యేక పూజల నిర్వహణ...

Update: 2022-03-18 02:45 GMT

హోలీని అద్వితీయంగా జరుపుకుంటున్న ఆదివాసీలు.. వెల్లిగోగు పూలతో...

Holi 2022: జీవితం ఒకటే.. కానీ ఆజీవితాన్ని ఆనందమయంగా మార్చే వర్ణాలు ఎన్నో. పండుగ ఒకటే.. కానీ జరుపుకునే విధానాలు ఎన్నో. ప్రాంతాలు, జీవన విధానాలు బట్టి పండుగ జరుపుకునే ఆచార విధానాలు సైతం మారుతూఉంటాయి. అందులో అడవి బిడ్డలు హోలీ జరుపుకునే విధానం ఎంతో ప్రత్యేకం, అద్వితీయం.

ఏ పండుగైనా, ఏ ఉత్సవమైన ఆదివాసులు జరుపుకునే తీరు వేరు. తమ ముత్తాతల కాలం నుండి సనాతంగా వస్తున్న ఆచార వ్యవహారాలను మరువకుండా పాటించే ఆదివాసులు హోలి పండుగను సైతం ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. హోలీ అందరికీ రంగుల పండుగ మాత్రమే. కానీ.. ఆదివాసులకు మాత్రం హోలీ మరో ఉగాదిగా చెప్పుకోవచ్చు.

హోలీ పండుగకు ముందు ఆదివాసీలు అడవిలోని వెల్లిగోగు పూలను సేకరిస్తారు. అలా సేకరించిన వాటిని మరిగించి సహజసిద్ధమైన రంగులుగా తీసి, పండుగ రోజు వాడుకోవడానికి సిద్ధంగా ఉంచుతారు. పండుగకు ముందు కామదహనం రోజు.. స్త్రీ, పురుషులను ఆరాధిస్తూ వారి రూపాల్లో ప్రక్కప్రక్కనే వెదురు బొంగులు పేర్చుతారు. ఈరెండింటిని మాత్రి, మాత్రల్ గా అంటే చనిపోయిన పెద్దల స్త్రీ, పురుష రూపాలుగా ఊహించుకుంటారు.

ఇక ఆవెదరు బొంగులకు నవధాన్యాలు, బూరెలు, ఎండు కొబ్బరిలను పెట్టి అలంకరిస్తారు. సాయంత్రం వేళ అందరూ కలిసి ఆవెదురు బొంగులకు మంటపెట్టి కామదహనం నిర్వహిస్తారు. అయితే ఈ వెదురు బొంగులు కాలేటప్పుడు వాటిపై అలంకరించిన నవధాన్యాలు, బూరెలు, కొబ్బరి ఇతర ఆహార పదార్థాలు మంటలో పడకుండా జాగ్రత్త పడతూ వాటిని సేకరిస్తారు. అలా సేకరించిన వాటిని గ్రామంలోని అందరూ సహపంక్తిగా కూర్చుని భుజిస్తారు.

అయితే దహనం తర్వాత మిగిలిన బూడిదను స్త్రీ, పురుష రూపాలుగా వేరు చేసి ఇంటికి తీసుకెళ్తారు. అయితే పురుష రూపంలో ఉన్న బూడిదను ఇంట్లో దృష్ట శక్తులు ప్రవేశించకుండా ఉంచుకుని, స్త్రీ రూపంలో ఉన్న బూడిదను వ్యాధులు ప్రబలించే సమయాల్లో ఊరు పొలిమేర చుట్టూ పోస్తారు. ఇక పండుగ రోజు ఉదయం తెల్లవారక ముందే నవధాన్యాలతో గూడాలు వండుకుని తమ పొలాలకు వెళ్లి దేవుడికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Tags:    

Similar News