Snow Moon 2026: రేపే అరుదైన ‘స్నో మూన్’.. ఆకాశంలో అద్భుత దృశ్యం! ఈ మంచు చందమామను మిస్సవ్వకండి!
Super Snow Moon 2026: ఖగోళ ప్రేమికులకు పండుగలాంటి వార్త. ఫిబ్రవరి రాకతోనే ఆకాశంలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది.
Super Snow Moon 2026: ఖగోళ ప్రేమికులకు పండుగలాంటి వార్త. ఫిబ్రవరి రాకతోనే ఆకాశంలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఫిబ్రవరి 1వ తేదీన 'మంచు చంద్రుడు' (Snow Moon) తన నిండు పున్నమి వెలుగులతో భూమిని పలకరించబోతున్నాడు. ఈసారి వచ్చే పౌర్ణమికి 'మాఘ పూర్ణిమ' అనే ఆధ్యాత్మిక ప్రాధాన్యత కూడా తోడవ్వడంతో ఈ అద్భుతాన్ని చూసేందుకు జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అసలేమిటీ 'స్నో మూన్'?
ఉత్తర అర్ధగోళంలో ఫిబ్రవరి నెలలో మంచు విపరీతంగా కురుస్తుంది. ఈ సమయంలో వచ్చే పున్నమి చంద్రుడిని పురాతన తెగలు 'స్నో మూన్' లేదా 'మంచు చంద్రుడు' అని పిలిచేవారు. 1760వ దశకంలో కెప్టెన్ జోనాథన్ కార్వర్ అనే అన్వేషకుడు తన రికార్డుల్లో ఈ పేరును ప్రస్తావించారు. శీతాకాలంలో వచ్చే ఇతర పౌర్ణమిల కంటే ఈ నెలలో వచ్చే చందమామ మరింత ప్రకాశవంతంగా, తెల్లగా మెరుస్తూ కనిపిస్తుంది.
'చంద్ర భ్రమ'.. కళ్లకు విందు!
ఆదివారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత చంద్రోదయం సమయంలో చందమామను చూస్తే అది మామూలు కంటే చాలా పెద్దదిగా కనిపిస్తుంది. దీనిని సైంటిస్టులు 'మూన్ ఇల్యూజన్' (చంద్ర భ్రమ) అని పిలుస్తారు. చంద్రుడు భూమికి దగ్గరగా ఉండి, క్షితిజ సమాంతరంగా ఉన్నప్పుడు భవనాలతో పోల్చుకుంటే అది భారీ పరిమాణంలో ఉన్నట్లు మన కళ్లకు అనిపిస్తుంది. కర్కాటక రాశికి సమీపంలో ఈ స్నో మూన్ దర్శనమివ్వనుంది.
ఖగోళ వింతలు - విశేషాలు:
హేలోస్ (Haloes): ఆకాశంలో సన్నని మేఘాలు ఉన్నప్పుడు, చంద్రుడి చుట్టూ కాంతి వలయాలు (హేలోస్) ఏర్పడే అవకాశం ఉంది. ఇది చందమామ కాంతిని రెట్టింపు చేస్తుంది.
సింక్రోనస్ రొటేషన్: భూమి, చంద్రుడు ఒకే వేగంతో తిరగడం వల్ల మనం ఎప్పుడూ చందమామ ఒక వైపునే చూడగలం. దీనినే 'సింక్రోనస్ రొటేషన్' అంటారు.
లింబ్ (Limb): టెలిస్కోప్ లేదా బైనాక్యులర్‌తో చూస్తే చందమామ అంచున ఉండే లోయలు, పర్వతాలను స్పష్టంగా గమనించవచ్చు. దీనిని 'లింబ్' అని పిలుస్తారు.
ఎక్కడ చూస్తే బాగుంటుంది?
నగరాల్లో ఉండే లైట్ల కాలుష్యం (Light Pollution) వల్ల చంద్రుడి అసలు కాంతిని పూర్తిగా ఆస్వాదించలేం. వీలైతే ఏదైనా పల్లెటూరికి లేదా వెలుతురు తక్కువగా ఉండే ప్రదేశానికి వెళ్లి ఈ 'స్నో మూన్'ను చూడాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సూర్యాస్తమయం తర్వాత తూర్పు దిశలో ఉదయించే చందమామను మనసారా చూసి ఆస్వాదించండి.