Viral Video : వందే భారత్ అంటే లోకల్ ట్రైన్ అనుకున్నారా? బీహార్‌లో టికెట్ లేకుండానే రైలు ఎక్కేసిన జనం

వందే భారత్ అంటే లోకల్ ట్రైన్ అనుకున్నారా? బీహార్‌లో టికెట్ లేకుండానే రైలు ఎక్కేసిన జనం

Update: 2026-01-26 04:40 GMT

Viral Video : దేశంలో అత్యంత వేగవంతమైన, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన రైలుగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గుర్తింపు పొందింది. ఇది ఒక ప్రీమియం రైలు కాబట్టి, ఇందులో ప్రయాణించాలంటే ముందుగానే రిజర్వేషన్ చేసుకోవడం తప్పనిసరి. కానీ బీహార్‌లో ఈ రైలు ప్రారంభమైన తొలిరోజే ఒక వింత సంఘటన జరిగింది. టికెట్ లేదు, రిజర్వేషన్ లేదు.. కానీ డజన్ల కొద్దీ జనం గుంపులు గుంపులుగా రైలులోకి దూసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చకు దారితీస్తోంది.

సాధారణంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో సీట్లు పరిమితంగా ఉంటాయి. ఐఆర్‌సీటీసీ నియమాల ప్రకారం కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. కానీ బీహార్‌లో ఈ రైలు తన కొత్త రూట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఒక స్టేషన్ వద్ద ఆగినప్పుడు ఊహించని పరిణామం ఎదురైంది. రైలు ఆగీ ఆగగానే అక్కడ వేచి ఉన్న స్థానికులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో రైలు గేట్ల వద్దకు చేరుకున్నారు. గేట్లు తెరుచుకోవడమే ఆలస్యం.. ఒకరిని నెట్టుకుంటూ మరొకరు లోపలికి దూసుకెళ్లారు. అది చూసిన లోపల ఉన్న ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

రైలు లోపలికి వచ్చిన వారిలో చాలా మందికి ఇది ఎలాంటి రైలో కూడా తెలియదని వీడియో చూస్తే అర్థమవుతోంది. వారు దానిని ఒక సాధారణ ప్యాసింజర్ రైలుగా భావించి లోపలికి ప్రవేశించినట్లు కనిపిస్తోంది. లోపలికి వెళ్లిన వెంటనే అక్కడ ఉన్న కోచ్ అటెండెంట్ వారిని అడ్డుకున్నాడు. "గేటు మూసుకుపోతే ఇబ్బంది పడతారు, దయచేసి దిగిపోండి" అని ఎంతగా బతిమాలినా జనం మాత్రం తగ్గలేదు. లోపల ఉన్న సీట్లను, ఏసీని వింతగా చూస్తూ అక్కడే నిలబడిపోయారు. దీనివల్ల అసలైన ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది.

ఈ వీడియోలో ఎక్కువగా మహిళలు, వృద్ధులు కనిపిస్తున్నారు. మరికొందరు కేవలం ఈ కొత్త రైలు ఎలా ఉంటుందో చూడాలనే కుతూహలంతో లోపలికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రైలు బయలుదేరడానికి సమయం కావస్తుండటంతో, లోపల ఉన్న ప్రయాణికులు కూడా గట్టిగా కేకలు వేయడంతో ఆ గుంపు నెమ్మదిగా కిందకు దిగిపోయింది. ఈ మొత్తం తతంగం అంతా ఎక్స్‎లో ఒక యూజర్ పోస్ట్ చేయడంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ప్రభుత్వ ఆస్తులను ఉపయోగించుకునేటప్పుడు కనీస సివిక్ సెన్స్ ఉండాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఈ ఘటనపై రైల్వే శాఖ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, ప్రీమియం రైళ్లలో భద్రతను పెంచాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో వందే భారత్ రైళ్లపై రాళ్లు రువ్వడం వంటి ఘటనలు జరిగాయి, ఇప్పుడు ఇలా టికెట్ లేకుండా గుంపులుగా లోపలికి ప్రవేశించడం ఆందోళన కలిగిస్తోంది. మన దేశంలో అత్యాధునిక టెక్నాలజీ వస్తున్నా, ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలని ఈ వీడియో స్పష్టం చేస్తోంది.

Tags:    

Similar News