Viral Video : అమెరికాలో చలి బీభత్సం..మైనస్ 21 డిగ్రీల చలిలో గడ్డ కట్టిన నూడిల్స్

అమెరికాలో చలి బీభత్సం..మైనస్ 21 డిగ్రీల చలిలో గడ్డ కట్టిన నూడిల్స్

Update: 2026-01-25 05:30 GMT

Viral Video : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చలిపులి పంజా విసురుతోంది. అనేక దేశాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. విదేశాల్లో కురుస్తున్న మంచు బీభత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా అమెరికా నుంచి వచ్చిన ఒక వీడియో చూస్తే మాత్రం మీ ఒళ్లు గగుర్పొడవక మానదు. అక్కడ చలి ఎంత ఘోరంగా ఉందంటే.. తినే ఆహారం కూడా క్షణాల్లో గడ్డకట్టి గాలిలోనే తేలుతోంది.

అమెరికాలోని మినియాపోలిస్ నగరంలో ప్రకృతి తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. జనవరి 23వ తేదీన అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 21 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు పడిపోయాయి. చల్లటి గాలుల తీవ్రత మైనస్ 45 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు చేరుకుంది. ఈ భయంకరమైన చలిలో ఏదైనా వస్తువును బయట పెడితే అది క్షణాల్లో గడ్డకట్టిపోవడం ఖాయం. దీనిని నిరూపించడానికి ఒక వ్యక్తి చేసిన ప్రయోగం ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.

వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక వ్యక్తి తన ఇంటి బాల్కనీలో ప్లేటు నిండా పాస్తాను ఉంచాడు. విచిత్రం ఏమిటంటే.. ఆ పాస్తాలో ఉన్న స్పూన్ ఎటువంటి ఆధారం లేకుండా గాలిలోనే నిలబడి ఉంది. వాస్తవానికి ఆ పాస్తా గడ్డకట్టి గట్టిగా మారిపోవడంతో, స్పూన్ కూడా ఆ మంచులో చిక్కుకుపోయి గాలిలో తేలుతున్నట్లు కనిపిస్తోంది. చూడ్డానికి ఇది ఏదో మ్యాజిక్ లాగా అనిపించినా, అక్కడ ఉన్న గడ్డకట్టే చలికి అది నిదర్శనం. వేడి వేడి పాస్తాను బయట పెట్టగానే, అది చలికి క్షణాల్లో ఐస్ ముక్కలా మారిపోయింది.

ఈ వీడియోను సోషల్ మీడియా వేదిక ఎక్స్‎లో @McDermedFox9 అనే ఖాతా ద్వారా షేర్ చేశారు. "ఈ ఉదయం మినియాపోలిస్‌లో ఉష్ణోగ్రత -21°Fకి పడిపోయింది. అందుకే నేను ఈ పాస్తా ప్రయోగాన్ని చేయాల్సి వచ్చింది" అని క్యాప్షన్‌లో పేర్కొన్నారు. కేవలం 7 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటివరకు 30 లక్షల (3 మిలియన్ల) కంటే ఎక్కువ మంది వీక్షించారు.

నెటిజన్లు ఈ వీడియో చూసి ఆశ్చర్యపోతున్నారు. "నమ్మలేకపోతున్నాను! చలి ఇంత దారుణంగా ఉంటుందా?" అని ఒకరు కామెంట్ చేయగా.. "అందుకే నేను ఎండలు ఎక్కువగా ఉండే కాలిఫోర్నియాలో ఉంటున్నాను" అని మరొకరు చమత్కరించారు. మరికొన్ని చోట్ల ప్రజలు వేడి నీళ్లను గాలిలోకి చల్లగానే అవి మంచు కణాలుగా మారిపోతున్న వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఈ ఏడాది చలి తీవ్రత గత రికార్డులను తిరగరాస్తోంది.

Tags:    

Similar News