Viral Video: తన మలాన్ని అమ్మి రూ.లక్షలు సంపాదిస్తున్న యువకుడు.. ఇది సరదాకోసం కాదు!

Viral Video: కెనడాకు చెందిన యువకుడు తన మల నమూనాలను విక్రయించి లక్షల ఆదాయం సంపాదించాడు. ఈ విధానం ద్వారా వందల మంది రోగులు కోలుకున్నారు.

Update: 2026-01-28 07:13 GMT

Viral Video: తన మలాన్ని అమ్మి రూ.లక్షలు సంపాదిస్తున్న యువకుడు.. ఇది సరదాకోసం కాదు!

Viral Video: వినూత్నంగా ఆలోచిస్తే ఆదాయం సంపాదించడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయని మరోసారి నిరూపించాడు ఓ యువకుడు. కెనడాకు చెందిన 20 ఏళ్ల యువకుడు తన మల నమూనాలను విక్రయించి గతేడాది సుమారు రూ.3.4 లక్షల ఆదాయం పొందాడు. అంటే నెలకు సగటున రూ.28,333 వరకు సంపాదించాడు. అయితే ఇది సరదా కోసం కాదు.. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వందల మందికి ఉపశమనం కలిగించే వైద్య ప్రక్రియలో భాగంగా ఈ పని చేస్తున్నాడు.

చిల్లివాక్ నగరానికి చెందిన ఈ యువకుడు ఫేకల్ మైక్రోబయోటా ట్రాన్స్‌ప్లాంటేషన్ (FMT) అనే వైద్య విధానానికి తన మల నమూనాలను అందిస్తున్నాడు. ఈ విధానాన్ని క్లోస్ట్రిడియోయిడ్స్ డిఫిసిల్ అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌తో బాధపడే రోగులకు ఉపయోగిస్తారు. ఈ ఇన్ఫెక్షన్ వల్ల తీవ్రమైన విరేచనాలు, కడుపునొప్పి, జ్వరం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

FMT ప్రక్రియలో ఆరోగ్యంగా ఉన్న దాత నుంచి సేకరించిన మలాన్ని శుద్ధి చేసి రోగి పెద్దప్రేగులోకి ప్రవేశపెడతారు. దీని ద్వారా పేగుల్లో మంచిబ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్ తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. గతేడాది మొత్తం 149 మల నమూనాలు అందించిన ఈ యువకుడికి ఒక్కో నమూనాకు 25 డాలర్లు (సుమారు రూ.2,300) చెల్లించినట్లు సమాచారం.

తన మల నమూనాల ద్వారా దాదాపు 400 మంది రోగులు కోలుకోవడం తనకు ఎంతో గర్వంగా ఉందని ఆ యువకుడు వెల్లడించాడు. ఈ అసాధారణ ఉద్యోగం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. 



Tags:    

Similar News