Viral Video: బుద్ధి చెప్పబోతే బంకుకే నిప్పు.. సిగరెట్ వద్దన్నందుకు పెట్రోల్ ట్యాంక్‌లోకి లైటర్ విసిరేసిన ఉన్మాది!
Viral Video: పెట్రోల్ బంక్‌లో సిగరెట్ కాల్చడం ప్రమాదకరమని వారించినందుకు ఓ వ్యక్తి ఏకంగా పెట్రోల్ ట్యాంక్‌కే నిప్పంటించిన విస్తుపోయే ఘటన ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్‌లో చోటుచేసుకుంది.
Viral Video: పెట్రోల్ బంక్‌లో సిగరెట్ కాల్చడం ప్రమాదకరమని వారించినందుకు ఓ వ్యక్తి ఏకంగా పెట్రోల్ ట్యాంక్‌కే నిప్పంటించిన విస్తుపోయే ఘటన ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్‌లో చోటుచేసుకుంది. కొందరు వ్యక్తుల బాధ్యతారాహిత్యం వల్ల పెను ప్రమాదం సంభవించే పరిస్థితి తలెత్తింది.
అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఫిబ్రవరి 18వ తేదీ రాత్రి 7:40 గంటల సమయంలో రాయ్‌పుర్‌లోని ఒక పెట్రోల్ బంక్‌కు ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చారు. ఒకరు బైక్‌లో పెట్రోల్ పోయిస్తుండగా, మరొక వ్యక్తి పక్కనే నిలబడి లైటర్‌తో సిగరెట్ వెలిగించడానికి ప్రయత్నించాడు. పెట్రోల్ బంక్ వద్ద మంటలు అంటుకునే ప్రమాదం ఉందని గమనించిన తోటి వ్యక్తి (బైక్ నడుపుతున్న వ్యక్తి) అతడిని వారించాడు.
ఆగ్రహంతో పెట్రోల్ ట్యాంక్‌కు నిప్పు..
సిగరెట్ తాగొద్దని చెప్పడంతో సదరు వ్యక్తి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే తన చేతిలో ఉన్న లైటర్‌ను వెలిగించి, బైక్ ఫ్యుయల్ ట్యాంక్‌లో పడేశాడు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బైక్ అంటుకుంది. ఊహించని ఈ ఘటనతో బంక్ వద్ద ఉన్న వారు భయాందోళనకు గురయ్యారు.
అప్రమత్తమైన సిబ్బంది:
సమయస్ఫూర్తితో వ్యవహరించిన పెట్రోల్ బంక్ సిబ్బంది వెంటనే ఫైర్ ఎక్స్‌టింగ్యూషర్‌లను ఉపయోగించి మంటలను ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే భారీ పేలుడు సంభవించి ప్రాణ, ఆస్తి నష్టం జరిగేది. నిప్పు పెట్టి పారిపోవడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను సిబ్బంది వెంబడించి పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా, నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సిసిటివి కెమెరాలో రికార్డవ్వగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.