Notary Act: న్యాయవాదులకు గమనిక.. ఇప్పుడు నోటరీ చట్టం 1952 మారుతోంది.. ఏంటంటే..?

Notary Act: న్యాయ మంత్రిత్వ శాఖ ప్రతిపాదిత సవరణ బిల్లులో చాలా కొత్త విషయాలు దాగి ఉన్నాయి...

Update: 2021-12-09 09:30 GMT

Notary Act: న్యాయవాదులకు గమనిక.. ఇప్పుడు నోటరీ చట్టం 1952 మారుతోంది.. ఏంటంటే..?

Notary Act: దేశంలోని యువ న్యాయవాదుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, నోటరీల చట్టం 1952ను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రంగంలో మరింత మంది యువ న్యాయవాదులకు ప్రవేశం కల్పించడమే దీని ఉద్దేశం. అంతేకాకుండా ఒక వ్యక్తి కొంత కాలం మాత్రమే ఈ పనిలో కొనసాగుతారు. నోటరీల చట్టం 1952లోని నిబంధనల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణీత అర్హతలు కలిగిన వ్యక్తులను నోటరీలుగా నియమించే హక్కును కలిగి ఉన్నాయి.

న్యాయ మంత్రిత్వ శాఖ ప్రతిపాదిత సవరణ బిల్లులో చాలా కొత్త విషయాలు దాగి ఉన్నాయి. వృత్తిపరమైన అక్రమాలకు పాల్పడిన సందర్బంలో నోటరీ ప్రాక్టీస్ సర్టిఫికేట్‌ను సస్పెండ్ చేసే అధికారాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తోంది. అంతేకాకుండా నోటరీలు చేస్తున్న ప్రతి పనులను డిజిటలైజేషన్‌ చేయనుంది.

నోటరీల చట్టం, 1952 నిబంధనల ప్రకారం.. నోటరీ వర్క్ సర్టిఫికేట్ పునరుద్ధరణపై పరిమితి లేదు. నోటరీని నియమించిన తర్వాత అతను అపరిమిత సంఖ్యలో సర్టిఫికెట్‌ పునరుద్దరణలు చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన నోటరీల సంఖ్య 1956 నోటరీల నియమాల షెడ్యూల్‌ ప్రకారం నిర్ణయించారు.

ప్రస్తుత ప్రతిపాదిత అంశంలో నోటరీలు నిర్దిష్ట ప్రదేశంలో వ్యాపార అవసరాలు, నోటరీల అవసరం ఉన్న చోట పనిచేయాల్సి ఉంటుంది. "ప్రతిపాదిత సవరణ బిల్లు నోటరీ గరిష్ట సేవా కాలాన్ని 15 సంవత్సరాలుగా నిర్ణయించాలని చెబుతోంది. ఇందులో ఐదేళ్ల ప్రారంభ పదవీకాలం తర్వాత ఒక్కొక్కటి ఐదు సంవత్సరాల చొప్పున రెండు పునరుద్ధరణ పొడిగింపులు ఉంటాయి" అని మంత్రిత్వ శాఖ తెలిపింది.

అక్రమాలకు పాల్పడినట్లు తేలినట్లయితే వర్క్ సర్టిఫికేట్‌ను సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది. ముసాయిదా బిల్లు కాపీ సంప్రదింపుల కోసం న్యాయ వ్యవహారాల శాఖ https://legalaffairs.gov.in/ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనిపై వ్యాఖ్యానించడానికి లేదా స్పందించడానికి చివరి తేదీ డిసెంబర్ 15, 2021గా నిర్ణయించారు.

Tags:    

Similar News