History and significance of bakrid : బక్రీద్ అంటే ఏమిటి..? ఈ పండగ ప్రాముఖ్యత ఏమిటి ?

Update: 2020-08-01 08:07 GMT

History and significance of bakrid : ముస్లింల ప్రధాన పండగలు రెండు ఒకటి రంజాన్ రెండవది బక్రీద్. ఈ పండుగకు ఈదుల్.. అజహా, ఈదుజ్జహా, లేక బక్రీద్ అని కూడా అంటారు. ఈద్ అల్-అజ్ హా ఈదుల్ అజ్ హా లేదా ఈదుజ్జుహా లేదా బఖర్ ఈద్ లేదా బక్రీదు అని కూడా పిలుస్తారు. ఇస్లామీయ కేలండర్ ప్రకారం 12వ నెల యైన జుల్ హజ్జా 10వ తేదీన ఈ పండుగ జరుపుకొంటారు. ఈ పండుగ 3 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ నెలలోనే హజ్ తీర్థయాత్రగూడా చేస్తారు. ఈ యాత్ర కోసం సౌదీ అరేబియా లోని మక్కా నగరానికి వెళ్ళి మస్జిద్-అల్-హరామ్ లోని కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తారు. ఈ పండుగ రంజాన్ పండుగ జరిగిన 70 రోజుల తరువాత జరుపుకుంటారు.

బక్రీద్ పండగను ఎందుకు జరుపుకుంటారు..?

అల్లాహ్ ఆదేశం ప్రకారం ఇబ్రాహీం ప్రవక్త తనకుమారుడైన ఇస్మాయీల్ను బలి ఇవ్వడానికి సిద్దపడతాడు. ఆ సాంప్రదాయాన్ని స్మరిస్తూ ప్రపంచంలోని ముస్లింలు ఈ పండుగను జరుపు కొంటారు. ఈ పండుగకు ప్రామాణికం ఖురాన్. (ఇరాన్ లో ముస్లింలు దీనిని 3వ అతి ముఖ్యమైన పండుగగా జరుపుకొంటారు.) ఈదుల్ ఫిత్ర్ (రంజాన్) లో లాగ, బక్రీదు పండుగనాడు కూడా ప్రార్థనలు ఖుత్బా (ధార్మిక ప్రసంగం) తో ప్రారంభమౌతుంది.

హజ్ యాత్రకోసం అరబ్ దేశం సౌదీ అరేబియా‌లోని మక్కా నగరానికి ఎక్కడెక్కడి నుంచో చేరుకుని మసీద్ లో ఉన్న కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తారు. అనంతరం అక్కడ ప్రార్థనలు చేస్తారు. ప్రపంచంలోని ముస్లింలందరూ కాబా గృహం చుట్టూ ఉన్న మసీద్ వైపు తిరిగి నమాజ్ ( ప్రార్థనలు ) చేస్తారు. ఇలా ప్రార్థనలు చేయడాన్ని ఖిబ్లా అని కూడా అంటారు. అక్కడ ప్రార్థనలు పూర్తి చేసుకున్న వారు మక్కా నుండి మదీనా ( ముహమ్మద్ ప్రవక్త గోరీ ఉన్ననగరం )ను సందర్శిస్తారు.

పండగ చరిత్ర..

అల్లాహ్‌ పంపిన ప్రవక్తల్లో ఒకరైన హజరత్‌ ఇబ్రహీం త్యాగనిరతికి ప్రతీకగా జరుపుకొనే పండగ బక్రీద్‌. ఇస్లాం క్యాలెండర్‌లోని బక్రీద్‌ మాసంలో 11వ రోజున ఈ పండగను జరుపుకోవడం ఆనవాయితీ. సమాజంలో పేరుకుపోతున్న రుగ్మతల నుంచి జనవాళిని జాగృతపరుస్తూ సన్మార్గంలో నడిపించేందుకు అల్లాహ్‌ భూమండలానికి 80వేల మంది ప్రవక్తల్ని పంపినట్లు ముస్లింల ఆరాధ్యగ్రంథం దివ్యఖురాన్‌ చెబుతోంది. వారిలో ఒకరు ప్రవక్త హజరత్‌ ఇబ్రహీం. అల్లాహ్‌పై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం గడపాలని మానవాళికి బోధిస్తున్న ప్రవక్తల్లోని విశ్వాసాన్ని కూడా గ్రహించేందుకు అల్లాహ్‌ అనేక పరీక్షలతో పరీక్షించేవారు. ఈ క్రమంలో ప్రవక్త ఇబ్రహీం అనేక పరీక్షల్లో తన విశ్వాసాన్ని నిరూపించినట్లు పవిత్ర ఖురాన్‌ పేర్కొంది. ఈ క్రమంలోనే హజరత్‌ ఇబ్రహీం, ఆయన సతీమణి హజీరాలకు వారి వృద్ధాప్యంలో అల్లాహ్‌ వారికి సంతానప్రాప్తి కలిగించారు. లేక లేక జన్మించిన తమ కుమారుడు ఇస్మాయిల్‌ను వృద్ధ దంపతులు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తరుణంలో ఒక రోజు రాత్రి ఇబ్రహీం తమ కుమారుడు ఇస్మాయిల్‌ను అల్లాహ్‌పేర బలిదానం చేస్తున్నట్లు కలగంటారు. దీంతో అల్లాహ్‌ తన కుమారుడిని బలిదానం కోరుకుంటున్నారని గ్రహించిన ఇబ్రహీం తన కుమారుడు ఇస్మాయిల్‌ను బలిదానం (ఖుర్బానీ) ఇచ్చేందుకు సిద్ధపడ్తారు. తండ్రి అంతరంగాన్ని గమనించిన కుమారుడు ఇస్మాయిల్‌ కూడా అల్లాహ్‌ మార్గంలో బలయ్యేందుకు సిద్ధపడ్తారు. బలి ఇచ్చే సమయంలో పుత్రవాత్సల్యం అడ్డువస్తే. తనకు బలి ఇవ్వకుండా తన తండ్రి వెనకడుగు వేస్తే, అల్లాహ్‌తో విశ్వాసఘాతకుడిగా నిలవకుండా, కళ్లకు గంతలతో తనను బలిఇవ్వమంటూ తండ్రికి సూచిస్తారు. ఆ మేరకు అల్లాహ్‌ నామస్మరణతో తన కుమారుడిని బలి ఇచ్చేందుకు గొంతుపై కత్తిపెట్టిన క్షణంలో త్యాగ నిరతికి మెచ్చిన అల్లాహ్‌ ఆఖరు క్షణంలో అల్లాహ్‌ ఇస్మాయిల్‌ను తప్పించి అదే స్థానంలో ఒక దుంబా (పొట్టేలు) ను ప్రత్యక్ష పరుస్తారు. దీందో పొట్టేలు గొంతు తెగి అల్లాహ్‌మార్గంలో అది ఖుర్బాన్‌ అవుతుంది.ఇబ్రాం త్యాగనిరతిని మెచ్చిన అల్లాహ్‌ ఆరోజు నుంచి ఈదుల్ అజ్ హా (బక్రీద్‌) పండగను జంతు బలి ఇవ్వాలనీ, ఈ విధానాన్ని ప్రళయం వరకు కొనసాగించాలనీ, నిర్దేశించినట్లు ఇస్లాం చెబుతోంది.

హిజ్రీ అంటే ఏమిటి..?

మహ్మద్ ప్రవక్త మక్కా నుండి మదీనాకు తరలివెళ్లడాన్ని హిజ్రీగా పేర్కొంటారు. ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలన్నది ఇస్లాం మత సూత్రాలలో ఇదొకటి. మహ్మదీయులు సంవత్సరాన్ని హిజ్రీ అనే పేరుతో పిలుసుకుంటారు. హిజ్రీ అంటే వలసపోవడం అని అర్థం.

బక్రీద్ పండగ రోజున మటన్ మాత్రమే...

బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు మటన్ బిర్యానీ, మటన్ కుర్మా, మటన్ కీమా, షీర్ కుర్మా, కీర్ లాంటి వంటకాలను తయారు చేస్తారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల సమాధులను దర్శనం చేసుకుంటారు. వారి ఆత్మశాంతించేందుకు వారికిష్టమైన దుస్తులు, భోజనం అక్కడ ఉంచుతారు. స్వర్గంలో ఉన్న వారు వాటిని స్వీకరిస్తారని నమ్మకం.




Tags:    

Similar News