Skydiving: బామ్మ స్కైడైవింగ్‌ సాహసం.. 80 ఏళ్ల వయసులో రికార్డు!

Skydiving: వయసు ఒక్క సంఖ్య మాత్రమేనని మరోసారి నిరూపించారు డాక్టర్ శ్రద్ధా చౌహాన్.

Update: 2025-07-02 06:20 GMT

Skydiving: వయసు ఒక్క సంఖ్య మాత్రమేనని మరోసారి నిరూపించారు డాక్టర్ శ్రద్ధా చౌహాన్. తన 80వ పుట్టినరోజు సందర్భంగా, హరియాణాలోని నార్నాల్ ఎయిర్‌స్ట్రిప్ లో 10 వేల అడుగుల ఎత్తునుంచి స్కై డైవింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

మాజీ బ్రిగేడియర్ సౌరభ్ సింగ్ షెకావత్ తల్లి అయిన శ్రద్ధా చౌహాన్, సర్వైకల్ స్పాండిలైటిస్, స్పైనల్ డిస్క్ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటం విశేషం. అయినప్పటికీ, చిన్నప్పటి నుంచే తన కల అయిన ఆకాశంలో ఎగిరిపోవాలని అనుకున్న ఆమె, ఈ వయసులో తన కోరికను నెరవేర్చుకోవడం అందర్నీ ఆకట్టుకుంది.

ఈ సాహస యాత్రలో ఆమె కుమారుడు కూడా పాల్గొన్నారు. "అమ్మతో కలిసి స్కై డైవింగ్ చేయడం జీవితాంతం మర్చిపోలేని అనుభవం" అని షెకావత్ తెలిపారు. తన కలను నెరవేర్చిన కుమారుడికి శ్రద్ధా కృతజ్ఞతలు తెలిపారు.

భారతదేశంలో అత్యధిక వయస్సులో స్కై డైవింగ్ చేసిన మహిళగా శ్రద్ధా చౌహాన్ చరిత్ర సృష్టించారు. ఈ స్కై డైవింగ్‌కు సంబంధించిన వీడియోను స్కైహై ఇండియా తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

పలువురు నెటిజన్లు ఆమె ధైర్యాన్ని అభినందిస్తూ, "వయసు కేవలం సంఖ్య మాత్రమే" అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఆమె సాహసాన్ని చూసి ప్రేరణ పొందుతున్నారు.


Tags:    

Similar News