Prashant Kishorకు జడ్‌ కేటగిరీ భద్రత..!

Update: 2020-02-18 02:20 GMT

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం జడ్‌ కేటగిరీ భద్రత కల్పించనుందని ప్రచారం జరుగుతోంది. పశ్చిమ బెంగాల్‌ సెక్రటేరియట్‌ వర్గాలు కూడా ఈ విషయాన్నీ దృవీకరిస్తున్నాయి. ఇద్దరు వ్యక్తిగత భద్రత సిబ్బంది, ఒక ఎస్కాట్, హౌజ్ గార్డ్ సహా అవసరాన్ని బట్టి స్థానిక పోలీసులు కూడా ప్రశాంత్ కిషోర్‌కు భద్రత కల్పించనున్నారట. అసెంబ్లీ ఎన్నికలకు తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రశాంత్‌ కిశోర్‌ను రాజకీయ వ్యూహకర్తగా నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు జడ్‌ కేటగిరీ రక్షణ కల్పిస్తున్నారు మమతా. అయితే దీనిపై సీపీఎం నేత సుజన్‌ చక్రవర్తి మండిపడుతున్నారు.

ప్రభుత్వ సొమ్ముతో ప్రైవేటు వ్యక్తికి భద్రత ఎలా కల్పిస్తారని.. రాజకీయ అవసరాల కోసం ప్రశాంత్ కిషోర్ ను వాడుకుంటున్నారు.. అలాంటి వాళ్లకు జడ్‌ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వడం ఏంటని ఆయన ట్విట్టర్‌లో ప్రశ్నించారు. అయితే బీజేపీ మాత్రం దీనిపై ఇంకా నోరు మెదపలేదు. దీనికి కారణం బీజేపీతో ప్రశాంత్ కిషోర్ కు సన్నిహిత సంబంధాలు ఉండటమే అని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు జడ్‌ కేటగిరీ భద్రతపై ఇవాళో రేపో కీలక ఉత్తర్వులు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇదిలావుంటే ప్రస్తుతం తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ప్రశాంత్ కిషోర్ టీమ్ పనిచేస్తోంది. ఆల్రెడీ పీకే టీమ్ గ్రౌండ్ లెవల్లో పని ప్రారంభించింది. ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో సైతం ఆమ్ ఆద్మీ పార్టీకి పీకే టీమ్ వ్యూహకర్తగా వ్యవహరించింది. ఏపీలో కూడా వైసీపీ తిరుగులేని విజయం సాధించడంలోనూ ఆయన పాత్ర ఉంది. ఈ నేపథ్యంలో పీకే టీమ్ లో కీలకంగా వ్యవహరించిన ఓ వ్యూహకర్తను టీడీపీ నియమించుకుందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై టీడీపీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ లో ఉపాధ్యక్షుడుగా ఉండటమే కాకుండా ఆ పార్టీలో ప్రధాన బాధ్యతలు చేపట్టారు. అయితే అనూహ్యంగా ఆ పార్టీ ప్రశాంత్ కిషోర్ ను బహిష్కరించింది.   

Tags:    

Similar News