Ranveer Allahbadia: రణ్‌వీర్ అలహబాదియాకు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్... సీరియస్ వార్నింగ్ కూడా..
Ranveer Allahbadia: రణ్‌వీర్ అలహబాదియాకు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్... సీరియస్ వార్నింగ్ కూడా..
YouTuber Ranveer Allahbadia: యూట్యూబర్, పాడ్‌కాస్టర్ రణ్‌వీర్ అలహబాదియాకు సుప్రీం కోర్టులో భారీ ఊరట దక్కింది. ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికే రణ్‌వీర్ అలహబాదియాపై మహారాష్ట్ర, అస్సాం, రాజస్థాన్‌లోని జైపూర్‌లో కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ కేసులన్నింటిని ఎదుర్కునేందుకు రణ్‌వీర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులన్నింటిని ఒక్క చోట చేర్చి విచారించేందుకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా రణ్‌వీర్ కోర్టును కోరారు. అంతేకాకుండా అరెస్ట్ నుండి బయటపడేందుకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు.
రణ్‌వీర్ అలహబాదియాకు ఊరటనిచ్చేలా సుప్రీం కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో రణ్‌వీర్‌పై మరో కేసు నమోదు చేయడానికి వీల్లేదని కోర్టు స్పష్టంచేసింది. ఆయన విచారణకు సహకరించినంత కాలం మహారాష్ట్ర, అస్సాం, జైపూర్ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడానికి వీల్లేదంది. అంతేకాకుండా తనకు, తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన చేసిన ఫిర్యాదుపై కూడా కోర్టు పలు సూచనలు చేసింది. మహారాష్ట్ర లేదా అస్సాం పోలీసులను ఆశ్రయించి ప్రాణహాని ఉందని చెప్పి వారి నుండి రక్షణ పొందాల్సిందిగా సుప్రీం కోర్టు సూచించింది.
రణ్‌వీర్ అలహబాదియాకు కోర్టు షరతులు
పోలీస్ కేసులు, అరెస్ట్, ప్రాణ హానీ విషయంలో భారీ ఊరటనిచ్చేలా ఉత్తర్వులు ఇచ్చిన సుప్రీం కోర్టు రణ్‌వీర్ అలహబాదియాకు పలు షరతులు కూడా విధించింది. ఆయన పాస్ పోర్ట్ మహారాష్ట్రలోని థానె పోలీసులకు అప్పగించాల్సిందిగా ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచివెళ్లే ప్రయత్నం చేయొద్దని తేల్చిచెప్పింది.
రణ్‌వీర్ అలహబాదియాపై సుప్రీం కోర్టు సీరియస్
రణ్‌వీర్ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఆయన తరుపున సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ తనయుడు అభినవ్ చంద్రచూడ్ ఈ కేసు వాదిస్తున్నారు.
ఈ సందర్భంగా అభినవ్ మాట్లాడుతూ, "రణ్‌వీర్ చేసిన వ్యాఖ్యలు నైతికంగా తనను కూడా షాక్‌కు గురయ్యేలా చేశాయన్నారు. ఆ విషయంలో తాను ఆయన్ను వెనకేసుకు రానన్నారు. అయితే, అలాగని ఆయన చేసిన వ్యాఖ్యలు అంత పెద్ద నేరం కిందకు వస్తాయా అనేదే ఇక్కడ ప్రశ్న" అని అభినవ్ వాదించారు.
ఈ దేశంలో ఇది అశ్లీలం కాక ఇంకేమవుతుంది?
అభినవ్ చంద్రచూడ్ వ్యాఖ్యలకు సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. జస్టిస్ సూర్య కాంత్ మాట్లాడుతూ.. ఈ దేశంలో ఇది అశ్లీలం కాక ఇంకేమవుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మేం పాపులర్ కదా అని ఏది పడితే అది మాట్లాడి వారి అభిప్రాయాలను సమాజంపై రుద్దాలనుకోవడం ఎంతమేరకు సమంజసం అని రణ్‌వీర్ అలహబాదియాను నిలదీశారు. రణ్‌వీర్ మనసులో ఏదో వంకర బుద్ది ఉంది కాబట్టి అలాంటి వ్యాఖ్యలను ఓ ప్రోగ్రాం ద్వారా బయటపెట్టారన్నారు. ఇలాంటి వారిని కోర్టు ఎందుకు చూస్తూ ఊరుకోవాలని అని జస్టిస్ కాంత్ మండిపడ్డారు. రణ్‌వీర్ మాట్లాడిన మాటలకు ఆయన తల్లిదండ్రులు, సోదరిమణులు, సమాజం అంతా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.
చంపేస్తామనే బెదిరింపులపై కోర్టు స్పందన
తనను చంపేస్తామని బెదిరింపులు వస్తుండంపై రణ్‌వీర్ అలహబాదియా కోర్టుకు ఫిర్యాదు చేశారు. రణ్‌వీర్ ఫిర్యాదును కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కోర్టు న్యాయ ప్రకారమే నడుచుకుంటుందని, బెదిరింపులను కోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్ధించదని జస్టిస్ కాంత్ అన్నారు. ఒకవేళ బెదిరింపులు ఏమైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని భావిస్తున్నట్లు సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.
Ranveer Allahbadia Row: రణ్‌వీర్ అలహాబాదియా కేసును వాదిస్తున్న సుప్రీం కోర్టు లాయర్ ఎవరో తెలుసా ? | hm డిజిటల్