ఇళ్లు కొంటున్న మహిళల సంఖ్యలో భారీ పెరుగుదల... ఎందుకో తెలుసా?

Update: 2025-03-10 11:07 GMT

Home Makers to Home buyers: ఇళ్లు కొంటున్న మహిళల సంఖ్యలో భారీ పెరుగుదల... ఎందుకో తెలుసా?

Home Makers to Home Buyers - A positive change : మహిళా శక్తిని చాటి చెప్పే మరో నివేదిక ఇది. మహిళలు అంటే హోమ్ మేకర్స్ మాత్రమే కాదు... వారు హోమ్ బయర్స్ కూడా అని నిరూపించుకుంటున్నారు. ఔను, సొంతంగా ఇల్లు కొంటున్న మహిళల సంఖ్య ఏ ఏడాదికి ఆ ఏడాదికి పెరిగిపోతోంది. 2023 తో పోల్చుకుంటే 2024 లో ఇల్లు కొన్న మహిళల సంఖ్య 14 శాతం పెరిగింది. 2023 లో ఇళ్లు కొన్న మహిళల సంఖ్య 1.14 లక్షలుగా ఉంది. ఇది ఆ ఏడాదిలో ఇల్లు కొనుగోలు చేసిన మొత్తం జనంలో 20 శాతంగా ఉంది. ఇక 2024 ఆ సంఖ్య 1.29 లక్షలకు పెరిగింది. 2024 లో మొత్తం ఇళ్లు కొనుగోలు చేసిన వారిలో ఇది 22 శాతం. అంటే ఏ విధంగా చూసుకున్నా, సొంతింటి కల నిజం చేసుకుంటున్న మహిళల సంఖ్య ఎక్కువగానే ఉంది.

రియల్ ఎస్టేట్ బిజినెస్‌ అభివృద్ధికి బూస్టింగ్ ఇస్తోన్న మహిళలు

రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొనసాగుతున్న స్క్వేర్ యార్డ్స్ అనే సంస్థ వెల్లడించిన నివేదికలో ఈ విషయం వెలుగుచూసింది. 'కీ హోల్డర్స్ ఆఫ్ చేంజ్ - ఉమెన్ డ్రైవింగ్ రియల్ ఎస్టేట్ గ్రోత్ అండ్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఇన్ 2024' పేరుతో స్క్వేర్ యార్డ్స్ ఈ నివేదికను విడుదల చేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధిలో సొంతంగా ఇళ్లు కొనుగోలుచేస్తోన్న మహిళల సంఖ్య పెరుగుతుండటం కూడా కీలక పాత్ర పోషిస్తోందని ఆ నివేదిక అభిప్రాయపడింది.

ఇళ్లు కొంటున్న మహిళల సంఖ్య పెరగడానికి కారణం ఏంటంటే...

"చదువుకుంటున్న మహిళల సంఖ్య పెరగడం, ఉద్యోగాలు చేస్తున్న వారి సంఖ్య భారీగా పెరగడంతో వారిలో ఆర్థిక స్వేచ్ఛ పెరిగింది. మహిళలు కూడా సొంతంగా ఎవరి కాళ్లపై వారు నిలబడి సొంతంగా ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. అందువల్లే ఇళ్లు కొనుగోలు చేస్తోన్న మహిళల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది" అని స్వ్కేర్ యార్డ్స్ సంస్థ వ్యవస్థాపకురాలు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కనిక గుప్త శోరి అభిప్రాయపడ్డారు. కొవిడ్ మహమ్మారి తరువాత దేశవ్యాప్తంగా మళ్లీ ఉద్యోగాల్లో చేరిన మహిళల సంఖ్య కూడా భారీగా పెరిగిన విషయం తెలిసిందే.

ఇండియాలో ఆస్తి కొనుగోలు, డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్స్‌ను పర్యవేక్షించే ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ (IGR) వద్ద నమోదైన రెసిడెన్షియల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ లావాదేవీలే ఈ లెక్కలను చెబుతున్నాయి. ముంబై, థానె, పూణె, బెంగళూరు, హైదరాబాద్, నొయిడా, గ్రేటర్ నొయిడా, ఘాజియాబాద్ లాంటి నగరాల్లో ఇల్లు కొనుగోలు చేసిన వారి సంఖ్యను కూడా ఈ నివేదిక వెల్లడించింది.

2023 లో ఈ మొత్తం సంఖ్య 5.56 లక్షలుగా ఉండగా 2024 లో ఈ సంఖ్య 5.77 లక్షలకు పెరిగింది. అంటే ఆయా నగరాల్లో గతేడాది దేశవ్యాప్తంగా ఇల్లు కొనుగోలు చేసిన వారి సంఖ్య 21,000 పెరిగిందన్నమాట. అందులో మహిళల సంఖ్య 15,000 వరకు ఉంది.

పురుషుల సంఖ్య విషయానికొస్తే...

2023 లో ఇళ్లు కొనుగోలు చేసిన పురుషుల సంఖ్య 1.96 లక్షలుగా ఉంది. ఆ తరువాతి ఏడాదికి ఆ సంఖ్య 2.18 లక్షలకు పెరిగింది. అంటే కేవలం పురుషులు మాత్రమే ఇళ్ల కొనుగోలు చేసిన సంఖ్య 11 శాతం పెరిగింది. పురుషులు, స్త్రీలు కలిపి జాయింట్ ఓనర్స్‌గా కొనుగోలు చేసిన లావాదేవీల సంఖ్య మాత్రం 7 శాతం తగ్గిందని ఈ నివేదిక స్పష్టంచేసింది.

ఈ సంఖ్య పెరగడానికి ఇతర కారణాలు

ఇళ్లు కొంటున్న మహిళల సంఖ్య పెరగడానికి మహిళల్లో అక్షరాస్యత, ఉద్యోగాలు చేస్తోన్న మహిళల సంఖ్య పెరగడం వంటివి ముఖ్య కారణాలుగా చూడొచ్చు. అయితే, ఇవే కాకుండా, మహిళల పేరుపై ఇల్లు కొనేవారికి స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు, హోజింగ్ లోన్ మంజూరు చేసే బ్యాంకులు వివిధ ప్రోత్సాహకాలు అందిస్తుండటం కూడా ఈ మార్పుకు మరో కారణం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మహిళా సాధికారత కోసం కొన్ని రాష్ట్రాల్లో మహిళల పేరుపై ఇల్లు కొనే వారికి రిజిస్ట్రేషన్ చార్జీల్లో ప్రభుత్వాలు మినహాయింపులు ఇవ్వడం లేదా బ్యాంకులు మహిళల పేరుపై తక్కువ వడ్డీ రేట్లు ఆఫర్ చేయడం వంటి పరిణామాలను అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే, ఉద్యోగాలు చేస్తూ ఇల్లు కొనే మహిళల సంఖ్యతో పోల్చుకుంటే, ఈ సంఖ్య తక్కువగానే ఉంటుంది.  

Countries with More Women Than Men: ఈ దేశాల్లో మగాళ్ళ కన్నా ఆడవాళ్ళే ఎక్కువ

Full View

Gongadi Trisha Exclusive Interview: పీరియడ్స్‌లో సెంచరీ చేశాను... 

Full View

Tags:    

Similar News