తలైవా రాజకీయాల్లో రాకపోతే లాభం ఎవరికి..? నష్టం ఎవరికి..?

ప్రజల్లో క్రేజ్‌ ఉన్న కొందరు సినీతారలకు రాజకీయాల మీద ఆసక్తి పెరుగుతోంది.

Update: 2020-12-29 15:28 GMT

ప్రజల్లో క్రేజ్‌ ఉన్న కొందరు సినీతారలకు రాజకీయాల మీద ఆసక్తి పెరుగుతోంది. అలాగే రజనీకాంత్‌ కూడా పాతికేళ్ళ నాడే ఇంట్రస్ట్‌ చూపించారు. సినిమాల్లో బిజీగా ఉండటంతో లేటయింది. ఇంతలో ఆరోగ్యం పాడయింది. అయినా పార్టీ స్థాపిస్తానంటూ ప్రకటన చేశారు. మళ్ళీ ఆరోగ్య సమస్య వచ్చింది. ఇక పూర్తిగా వెనకడుగు వేశారు. తలైవా రాజకీయాల్లో రాకపోతే లాభం ఎవరికి..? నష్టం ఎవరికి..?

సెలబ్రిటీలు రాజకీయాల్లోకి వస్తే ముఖ్య పదవి కొట్టాల్సిందే..ఆ లక్ష్యంతోనే వారు రాజకీయాల్లోకి రావడం దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. 40 సంవత్సరాలుగా సాగుతున్న సినీ రాజకీయాలను గమనిస్తే..ఎన్‌టీ రామారావు తర్వాత మరెవరూ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేదు. కొన్ని పార్టీలు అలా వచ్చి ఇలా మాయమయ్యాయి.. సినీ తారలు స్థాపించిన మరికొన్ని పార్టీలు అనేక పార్టీల్లో ఒకటిగా మిగిలిపోయాయి. ఆధ్యాత్మిక రాజకీయాలు చేస్తానని ప్రకటించిన రజనీకాంత్‌..1995 నుంచి ఆసక్తి చూపిస్తున్నారు. 70 ఏళ్ళ వయస్సులో రాజకీయాల్లోకి వస్తానంటే..చాలామంది పెదవి విరిచారు. ఈ వయస్సులో వచ్చి రాజకీయాలు ఏంచేస్తారని సందేహాలు వ్యక్తం చేశారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందు పార్టీ స్థాపిస్తే విజయం వరిస్తుందా అనే ప్రశ్నలు కూడా వేశారు.

తమిళనాడులో బాంబుల కల్చర్‌ పెరిగిపోయిందంటూ ప్రకటన చేసి.. 1995లో నాటి అన్నాడీఎంకే ప్రభుత్వం మీద సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేశారు రజనీకాంత్‌. 1996 ఎన్నికల్లో జయలలిత ప్రభుత్వాన్ని ఓడించాలంటూ తన అభిమానులకు పిలుపునిచ్చారు. డీఎంకే పార్టీ విజయం కోసం పనిచేయాలని కూడా అభిమానులకు చెప్పారు. అప్పటి ఎన్నికల్లో జయలలిత ప్రభుత్వం చిత్తు చిత్తుగా ఓడింది. 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా రజనీకాంత్‌ డీఎంకేకు మద్దతిచ్చారు. కాని అన్నాడీఎంకే కూటమి అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకుని తలైవాకు పెద్దగా పవర్‌ లేదని తేల్చేసింది. ఆ తర్వాత చాన్నాళ్ళ పాటు రజనీ రాజకీయాల గురించి మాట్లాడలేదు. ఇక అప్పటినుంచీ ఒక అడుగు ముందుకు..మరో అడుగు వెనక్కు అన్నట్లుగా రజనీ రాజకీయ ప్రవేశం సాగుతోంది.

2004లో రిలీజైన బాబా సినిమాలో ఆధ్యాత్మిక విషయాలు...రాజకీయాలు కలగలిపి చిత్రీకరించారు. దీంతో రజనీ రాజకీయాల్లోకి వస్తారంటూ మరోసారి ప్రచారం మొదలైంది. ఆయన ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా కచ్చితంగా రాజకీయాలపై ప్రశ్న అడిగేవారు. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందని తప్పించుకునేవారాయన. రజనీకి భక్తి భావాలు ఎక్కువ కావడంతో అప్పుడప్పుడు మానసిక ప్రశాంతత కోసం హిమాలయాలకు వెళ్ళి వస్తుంటారు. దాదాపు పదేళ్ళ నుంచి ఆయన్ను ఆరోగ్యం ఇబ్బంది పెడుతోంది. 2011లో కిడ్నీ సమస్య వచ్చింది..2016లో అమెరికాలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ జరిగింది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని డాక్టర్లు సూచించారు. ఎలాంటి నిర్లక్ష్యం పనికిరాదని కూడా హెచ్చరించారు. రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనను విరమించుకోవాలని రజనీకి డాక్టర్లు గట్టిగా సూచించారు. గడచిన మూడేళ్ళుగా రకరకాల ఊహాగానాలు వ్యాపించాయి. రజనీ ఆరోగ్యం కూడా సరిగా లేకపోవడంతో...ఇక రాజకీయ పార్టీ ఏర్పాటు సాధ్యం కాదేమో అంటూ ప్రచారం సాగింది. జయ మరణంతో..తమిళ రాజకీయాలు గందరగోళంగా మారాయి.

2014 ఎన్నికల్లో ఎన్‌డీఏ ప్రధాని అభ్యర్థిగా తమిళనాడులో ప్రచారానికి వచ్చిన నరేంద్ర మోడీ..రజనీకాంత్‌ నివాసానికి వెళ్ళి ఆయనతో సమావేశమయ్యారు. ఆ భేటీ తర్వాత మోడీని పొగడ్తలతో ముంచెత్తారు రజనీ. మోడీ గొప్ప నాయకుడని..ఆయన విజయం సాధించాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. ఇక అప్పటి నుంచి రజనీ చూపు బీజేపీ వైపు అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. 2017లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు చెన్నై వచ్చిన ప్రధాని మోడీ ...దానికి హాజరైన రజనీకాంత్‌ను ప్రత్యేకంగా పలకించి..షేక్‌హ్యాండ్‌ ఇచ్చారు. అదే సంవత్సరం డిసెంబర్‌లో తాను రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నట్లు రజనీ ప్రకటించారు. మళ్ళీ మూడేళ్ళ తర్వాత బీజేపీలో కీలక నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చైన్నై పర్యటన ముగిసిన కొద్ది రోజుల తర్వాత రజనీ రాజకీయ పార్టీ ప్రకటన వెలువడింది.

రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తే ఆయన్ను అడ్డం పెట్టుకుని తమిళనాట చక్రం తిప్పవచ్చని కమలనాథులు భావించారు. ప్రజాదరణ కోల్పోయిన అన్నాడీఎంకేతో జత కలిసేకంటే...మాస్‌ హీరో రజనీకాంత్ అయితే బెటరని...చాలా ఏళ్ళుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు రజనీ ప్రకటనతో కాషాయసేనకు తమిళనాట దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక కమల్‌హాసన్‌ కూడా తన స్నేహితుడి ప్రకటనతో విచారం వ్యక్తం చేశారు. రజనీ రాజకీయాల్లోకి వస్తే కలిసి పనిచేయవచ్చని కమల్‌ భావించారు. కాని రజనీకాంత్‌ ఆరోగ్యం కూడా తనకు ముఖ్యమని ప్రకటించారాయన. ఇక ముఖ్యమంత్రి పదవి కోసం ఎంతో ఆరాటపడుతున్న డీఎంకే అధినేత స్టాలిన్‌కు రజనీ ప్రకటన ఊరట నిచ్చేదే. ఇప్పటికే పతన దిశలో ఉన్న జయలలిత లేని అన్నా డీఎంకేకు రజనీ ప్రకటనతో పెద్దగా లాభనష్టాలు ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Tags:    

Similar News