Pakistan: ప్రధాని మోదీ ప్రసంగంపై స్పందించిన పాకిస్తాన్..ఏమన్నదంటే?
Pakistan: పాకిస్తాన్ వ్యవహారశైలిని పరిశీలిస్తామని, భవిష్యత్తులో ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకునే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. జాతినిఉద్దేశించి మోదీ చేసిన ప్రసంగాన్ని విమర్శించినప్పటికీ..కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని పాకిస్తాన్ పేర్కొంది. ఉద్రిక్తతల తగ్గింపు, ప్రాంతీయ స్థిరత్వం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
ఆపరేషన్ సింధూర్ తర్వాత జాతినుద్దేశించి తొలిసారి ప్రసంగించిన మోదీ పాకిస్తాన్ తీరుపై నిప్పులు చెరిగారు. దీనిపై పాకిస్తాన్ విదేశాంగశాఖ స్పందించింది. ఓ సుదీర్ఘ ప్రకటనను విడుదల చేసింది. ప్రాంతీయంగా శాంతి స్థిరత్వం కోసం అంతర్జాతీయ స్థాయిలో కృషి జరుగుతున్న వేళ భారత ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతలను పెంచేదిగా ఉన్నాయన్నది. కాల్పుల విరమణను తామే కోరినట్లు చెప్పడంలో వాస్తవం లేదని తెలిపింది. భారత్ చర్యలు ఈ ప్రాంతం మొత్తాన్ని ప్రమాదంలో పడేసలా ఉన్నాయని వ్యాఖ్యానించింది.
మరోవైపు ఉగ్రవాదం, వాణిజ్యం, ఉగ్రవాదం చర్చలు ఒకేసారి సాధ్యం కావని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఒకేచోట నీళ్లు, రక్తం ప్రవహించవని ఉద్ఘాటించారు. అణుబాంబు బెదిరింపులను భారత్ సహించదని..ఈ ముసుగులో విజ్రుంభిస్తున్న ఉగ్రవాద స్థావరాలపై కచ్చితమైన, నిర్ణయాత్మకమైన దాడి చేస్తుందని హెచ్చరించారు. భారత్ చేసిన దాడులను తట్టుకోలేక పాకిస్తాన్ చివరకు కాల్పుల విరమణ పేరుతో కాళ్ల బేరానికి వచ్చిందని ప్రధాని మోదీ అన్నారు.