PM Modi: ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళాలో ప్రధానిమోదీ పాల్గొనున్నారు. నేడు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. గంగానదిలో ప్రార్థనలు చేయనున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభమేళా ప్రాంతానికి చేరుకున్నారు. ఉదయం 10గంటలకు ప్రయాగ్ రాజ్ ఎయిర్ పోర్టుకు ప్రధాని మోదీ చేరుకుంటారు.
అక్కడి నుంచి అరైల్ ఘాట్ కు వెళ్తారు. ఉదయం 11 గంటల సమయంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తారు. అనంతరం ప్రయాగ్ రాజ్ ఎయిర్ పోర్టుకు వెళ్లి ఢిల్లీ బయలుదేరివెళ్తారు. ఈ పర్యటన సందర్భంగా ఎలాంటి కార్యక్రమాల్లోనూ ప్రధాని మోదీ పాల్గొనరని సమాచారం. మోదీ వస్తున్న నేపథ్యంలో నగరంతోపాటు కుంభమేళా దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళాకు భారత్ తోపాటు విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఇప్పటి వరకు 38కోట్ల మంది కుంభమేళాకు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. సామాన్యులతోపాటు అనేక మంది ప్రముఖులు కూడా ఈ కుంభమేళాకు హాజరవుతున్నారు.