Manoj Naravane: యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదు.. భారత ఆర్మీ మాజీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
Manoj Naravane: భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇటీవల శనివారం కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందం కుదిరింది.
Manoj Naravane: యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదు.. ఆర్మీ మాజీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
Manoj Naravane: భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇటీవల శనివారం కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందం కుదిరింది. అయితే, దీనిపై కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే (Manoj Naravane) కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం అనే విషయం బాలీవుడ్ సినిమాలు కాదు, అది ఎన్నో కుటుంబాల జీవితాలను ప్రభావితం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
పుణేలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న నరవణే మాట్లాడుతూ, ‘‘యుద్ధం వల్ల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజల పరిస్థితి దారుణంగా మారుతుంది. షెల్లింగ్ జరిగితే, చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాల ఆవేదన తరతరాల పాటు వెంటాడుతుంది’’ అని పేర్కొన్నారు. జనరల్ నరవణే మాట్లాడుతూ, ‘‘యుద్ధం అనేది మనం ఎంచుకునే చివరి అవకాశం కావాలి. ఇది ఎలాంటి రొమాంటిక్ విషయం కాదు. బాలీవుడ్ సినిమాల్లో చూపించినట్టుగా యుద్ధం వుండదు. అది చాలా తీవ్రమైన విషయం. ప్రజల జీవితం, భద్రత అనేది ప్రధాన అంశం కావాలి. అందుకే ప్రధానమంత్రి మోదీ కూడా ‘ఇది యుద్ధాల శకం కాదు’ అని చెప్పారు’’ అని గుర్తు చేశారు.
‘‘చాలామంది ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధానికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నిస్తున్నారు. అయితే, సైన్యంలో పనిచేసిన వ్యక్తిగా నేను ఎప్పుడైనా యుద్ధానికి సిద్ధంగా ఉన్నా. కానీ, దౌత్యానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం కావాలి. బలవంతంగా యుద్ధానికి వెళ్ళాల్సిన పరిస్థితి రాకూడదు. అవసరం అయితేనే అది తుదిపాయగా ఉండాలి’’ అని నరవణే స్పష్టం చేశారు.
భారత్ - పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో జనరల్ మనోజ్ నరవణే చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. యుద్ధం కంటే శాంతి, చర్చలద్వారా పరిష్కారం ముఖ్యం అనే సందేశాన్ని ఆయన స్పష్టంగా వినిపించారు.