బెంగాల్‌లో బీజేపీ వర్సెస్‌ టీఎంసీ.. రణరంగమైన సెక్రటేరియట్‌ ముట్టడి

బీజేపీ నేతలపై టియర్‌ గ్యాస్‌, వాటర్‌ క్యానన్ల ప్రయోగం

Update: 2022-09-14 03:31 GMT

బెంగాల్‌లో బీజేపీ వర్సెస్‌ టీఎంసీ.. రణరంగమైన సెక్రటేరియట్‌ ముట్టడి

West Bengal: పశ్చిమ బెంగాల్ రణరంగాన్ని తలపించింది. బీజేపీ కోల్‌కతాలో తలపెట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు తీవ్రస్థాయిలో జరిగాయి. రోడ్లపై రాళ్లు రువ్వడం, కర్రలతో దాడి చేసుకోవడం, టార్గెట్ చేసుకుని దాడి చేయడం వంటివి చాలా చోట్ల కనిపించాయి. ఓ పోలీసు అధికారిపై నిరసనకారుల దాడి కలకలం రేపింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ప్రతిపక్ష నేత సువేందు అధికారి, ఎంపీ లాకెట్ చటర్జీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హింసాత్మక నిరసనల తర్వాత రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది. బీజేపీ, టీఎంసీలు ఒకరిపై ఒకరు ఆరోపణ ప్రత్యారోపణలు చేసుకున్నాయి. పోలీసులు రెచ్చగొట్టడం వల్లే ఇంత హింస చెలరేగిందంటున్నారు బీజేపీ నేతలు.

బెంగాల్‌లో వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు కోల్‌కతా తరలివచ్చేందుకు ఏడు ప్రత్యేక రైళ్లు, పెద్ద సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేసింది. మరోవైపు బీజేపీ మార్చ్‌ను అడ్డుకునేందుకు కోల్‌కతాతో పాటు అనేక ప్రాంతాల్లో పెద్దఎత్తున పోలీసులు మోహరించారు. కోల్‌కతాలో పలు రహదారులను బారికేడ్లతో మూసివేశారు. సెక్రటేరియట్‌ చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిని దుర్భేద్యంగా మార్చారు. బీజేపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు నిలువరించారు. సంత్రాగచ్చిలో వారు పోలీసులపై రాళ్లు రువ్వారు. హౌరా, కోల్‌కతాలో లాల్‌బజార్‌, ఎంజీ రోడ్‌ ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బుర్రాబజార్‌ ప్రాంతంలో పోలీసు వాహనానికి నిప్పంటించారు. కార్యకర్తలతో కలిసి సెక్రటేరియట్‌ ముట్టడికి వెళుతున్న సువేందు అధికారిని పోలీసులు అడ్డుకున్నారు. సీఎం మమతా నియంతలా వ్యవహరిస్తూ బెంగాల్‌ను ఉత్తర కొరియాలా మారుస్తున్నారని ఆయన విమర్శించారు. సువేందుతో పాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేసి, ప్రిజన్‌ వ్యాన్‌లో తరలించారు. అయితే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేయడం, పోలీసులపై దాడిని తృణమూల్‌ కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది.

Tags:    

Similar News