Vice-Presidential Election 2025: ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల..!
Vice Presidential Election Schedule: భారతదేశంలో నూతన ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేసింది.
Vice Presidential Election Schedule: భారతదేశంలో నూతన ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఈ ఎన్నిక జరగనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్‌ఖడ్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక తప్పనిసరి అయింది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే ధన్‌ఖడ్ తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపించారు. ఆరోగ్య సమస్యల కారణంగానే పదవికి తప్పుకుంటున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. 2022 ఆగస్టు 11న ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన జగదీప్ ధన్‌ఖడ్ పదవీకాలం 2027 ఆగస్టు వరకు ఉండాల్సింది. అయితే, ఆయన మధ్యలోనే రాజీనామా చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు ఆగస్టు 7న నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా ఆగస్టు 21ను నిర్ణయించారు. అవసరమైతే ఆగస్టు 22న నామినేషన్లను పరిశీలిస్తారు. అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకునే తుది తేదీ ఆగస్టు 24గా నిర్ణయించారు.
సెప్టెంబర్ 9న ఓటింగ్ జరగనుండగా, అదే రోజున ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటించనున్నారు. 74 ఏళ్ల ధన్‌ఖడ్ రాజీనామా తర్వాత ఆ స్థానం కోసం ఎవరు పోటీలో నిలవనున్నారు అనే అంశంపై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది.