Uttarakhand CM: మరో సారి నోరు పారేకుసున్న ఉత్తరాఖండ్ సీఎం

Uttarakhand CM: రేషన్‌ ఎక్కువ కావాలంటే మరింత మంది పిల్లలను కనాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఉత్తరాఖండ్ సీఎం

Update: 2021-03-22 07:03 GMT

Tirath Singh Rawat (ఫోటో: ది హన్స్ ఇండియా)

Uttarakhand CM: ఉత్తరాఖండ్ సిఎం తీరత్‌ సింగ్‌ రావత్‌ నిరంతరం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవడం కామన్ అయిపోయింది. మొన్నటికి మొన్నమహిళల వస్త్రధారణపై వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కి నిరసనలు రావడంతో తన కామెంట్లకు క్షమాపణ చెప్పారు. అది మరవక ముందే మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తీరత్‌ సింగ్‌ రావత్‌.''ప్రభుత్వం అందించే రేషన్‌ ఎక్కువ కావాలనుకునేవారు మరింత మంది పిల్లలను కనాల్సింది కదా'' అంటూ నోరుపారేసుకున్నారు.

20 మంది పిల్లలను ఎందుకు కనలేదు...

''పేద కుటుంబాలకు కేంద్రం ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున రేషన్‌ అందిస్తోంది. ఇంట్లో 10 మంది ఉంటే వారికి 50కిలోల రేషన్‌ వస్తుంది. 20 మంది ఉంటే క్వింటాల్‌ అందుతుంది. ఇద్దరే ఉన్నవారికి 10కిలోలు మాత్రమే వస్తుంది. అలాంటప్పుడు ఎక్కువ రేషన్‌ వచ్చే వారిపై అసూయ ఎందుకు? మీకు సమయం ఉంది కదా.. అప్పుడెందుకు 20 మంది పిల్లలను కనలేదు'' అని తీరత్‌ వ్యాఖ్యానించడంతో దుమారం రేగింది.  

బ్రిటన్‌కు బదులు అమెరికా అని పలకడంతో... 

తీరత్‌ ఇలా వార్తల్లోకెక్కడం ఇదే తొలిసారి కాదు. ఇద్దరు పిల్లల తల్లై ఉండీ ఒకావిడ చిరిగిన జీన్స్‌ వేసుకుందని, అలాంటావిడ సభ్య సమాజానికి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారంటూ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత నిన్న ఓ బహిరంగసభలో మాట్లాడుతూ.. మన దేశాన్ని 200ఏళ్ల పాటు అమెరికా పాలించిందంటూ నోరుజారారు. కొవిడ్‌ కట్టడిలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ మిన్నగా వ్యవహరించిందని చెప్పే సమయంలో.. ''మన దేశాన్ని 200 ఏళ్ల పాటు ఏలిన అమెరికా సైతం నేడు కొవిడ్‌ కట్టడికి తీవ్రంగా శ్రమిస్తోంది'' అని అన్నారు. బ్రిటన్‌కు బదులు అమెరికా అని పలకడంతో సోషల్‌మీడియాలో ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సందించారు.

ఇలా ఉండగా ఈ ఎన్నికల సీజన్ లో ఓ బీజేపీ నేత, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా మాట్లాడి వివాదం రేపడాన్ని బీజేపీ నాయకత్వం అసంతృప్తిని ప్రకటించింది. ఈ విధమైన వ్యాఖ్యలు పార్టీకి చేటు తెస్తాయని భావిస్తోన్నట్లు సమాచారం.

Tags:    

Similar News