Union Cabinet Reshuffle: మరోవారంలో కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన!

Union Cabinet Reshuffle: రానున్న రోజుల్లో కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన జరుగుతుందనే ఊహాగానాలకు దేశ రాజధాని వేదికైంది.

Update: 2021-06-12 05:35 GMT

Union Cabinet Reshuffle: మరోవారంలో కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన!

Union Cabinet Reshuffle: రానున్న రోజుల్లో కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన జరుగుతుందనే ఊహాగానాలకు దేశ రాజధాని వేదికైంది. ప్రధాని మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక కేబినెట్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు దేశంలో కోవిడ్‌ ఉధృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల నుంచి విమర్శలను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత మంత్రివర్గంలో పనితీరు సరిగ్గా లేని మంత్రులను పక్కన పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు ప్రధాని మోడీ. కోవిడ్‌ సమయంలో మంత్రుల పనితీరుపై ఆయన సమీక్షిస్తున్నారు. ఈ వరుస భేటీల్లో ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటున్నారు. పలు శాఖల ప్రగతిపై ఆరా తీస్తున్నారు. కొందరి శాఖలు మార్చాలని, పనితీరు బాగా లేని మంత్రులను కేబినెట్ నుంచి తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని మోడీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు జూన్‌ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్‌ వేస్తామని ప్రధాని ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఆరుగురు మంత్రులు రెండేసి శాఖలను నిర్వహిస్తున్న నేపథ్యంలో కేబినెట్‌ విస్తరణపై వార్తలు ఊపందుకున్నాయి. మొత్తంగా 79 మంది మంత్రులను ప్రధాని ఏర్పాటు చేసుకోవచ్చు. దీంతో ఇంకో 20కి పైగా స్థానాలను పూరించేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉంది. రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మిత్రపక్షాలకు తన మంత్రివర్గంలో పెద్దపీట వేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో కేంద్రం కీలక పథకం కూడా ప్రకటించే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆధ్వర్యంలోని మంత్రివర్గంలో కూడా పలు మార్పులు జరుగుతాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో నిన్న యోగి ఆదిత్యనాథ్‌ సమావేశమయ్యారు. మోదీకి అత్యంత నమ్మకస్తుల్లో ఒకరైన మాజీ ఐఏఎస్‌ అధికారి ఏకే శర్మకు యూపీ ప్రభుత్వంలో కీలక పదవి ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. అలాగే కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన జితిన్‌ ప్రసాదకు కూడా యోగి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News