Union Budget 2025: నిర్మలా సీతారామన్ మధ్యతరగతిపై పన్నుల భారం తగ్గిస్తారా?
Budget 2025 Expectations: నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. నిజానికి బడ్జెట్ అంటే జమా, ఖర్చుల చిట్టా మాత్రమే కాదు. అది ప్రభుత్వ విధానాలకు దిక్సూచి లాంటిది. అదొక పాలసీ డాక్యుమెంట్.
Union Budget 2025: నిర్మలా సీతారామన్ బడ్జెట్ కార్పొరేట్లకు వరం... సామాన్యులకు శాపమా?
Union Budget 2025 Expectations: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇది నిర్మలా సీతారామన్ వరుసగా ప్రవేశపెడుతున్న ఎనిమిదో బడ్జెట్. గతంలో భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తరువాత మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం తొమ్మది సార్లు పార్లమెంటులో బడ్జెట్ సమర్పించారు. ఎనిమిది బడ్జెట్ ప్రజెంటేషన్స్‌తో ప్రణబ్ ముఖర్జీ ఆ తరువాత స్థానంలో ఉన్నారు.
అయితే, వీరెవరూ కూడా ఆ బడ్జెట్స్ వరసగా సమర్పించలేదు. మధ్యలో బ్రేక్స్ వచ్చాయి. కానీ, నిర్మలా సీతారామన్ నిరంతరాయంగా ఇప్పటికి 7 బడ్జెట్స్ ప్రవేశపెట్టి, ఎనిమిదో బడ్జెట్‌తో ప్రణబ్ దా రికార్డును ఈక్వల్ చేయబోతున్నారు. మోదీ మూడో విడత పాలనలో ఇది రెండో బడ్జెట్టే కాబట్టి... ఆమె ఈ విషయంలో అందరి రికార్డులను బ్రేక్ చేసే అవకాశం కూడా ఉంది.
సరే.. ఈ రికార్డుల సంగతి పక్కన పెడితే, ఈసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ఏముంటుంది? ఇదే ఇప్పుడు 50 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రశ్న. మోదీ 3.0 శకం మొదలైన తరువాత జూన్ నెలలో సమర్పించిన బడ్జెట్ అంచనాలు 48 లక్షల కోట్లకు పైమాటే. ఈసారి ఈ మొత్తం మరింత పెరుగుతుంది. అందులో డౌట్ లేదు. ముఖ్యంగా, ఈ బడ్జెట్‌లో ఏముంటుందన్న ప్రశ్న కార్పొరేట్లనే కాదు, ఇప్పుడు మధ్య తరగతి ప్రజలతో పాటు పేదలనూ వేధిస్తోంది.
నిజానికి బడ్జెట్ అంటే జమా, ఖర్చుల చిట్టా మాత్రమే కాదు. అది ప్రభుత్వ విధానాలకు దిక్సూచి లాంటిది. అదొక పాలసీ డాక్యుమెంట్. ఆరోగ్యం, విద్య, సంక్షేమం వంటి రంగాలకు ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యం ఇస్తుందన్నది బడ్జెట్‌లో కేటాయింపులు చూసి అర్ధం చేసుకోవచ్చు.
బడ్జెట్ మొత్తం ప్రతి ఏటా ఎంతో కొంత పెరుగుతున్నట్లు కనిపించినప్పటికీ దేశ స్థూల జాతీయోత్పత్తి అంటే జీడీపీలో ఎంత శాతం ఉందనే కోణంలో చూస్తే మాత్రం క్రమంగా తగ్గుతూపోతోంది. 2009-10 ఆర్థిక సంవత్సరోల బడ్జెట్ మొత్తం 17.43 శాతంగా ఉండేది. అది 2024-25 సంవత్సరానికి 14.76 శాతానికి తగ్గింది. జీడీపీ వృద్ధి ఇంకా తగ్గుతుండడంతో ఈ ట్రెండ్ మెరుగుపడే సూచనలు కూడా కనిపించడం లేదు. 2025-26లో భారత స్థూల జాతీయోత్పత్తి 326 లక్షల కోట్ల రూపాయలు ఉండవచ్చన్నది అంచనా. గత ఏడాది మీద 10 శాతం పెరుగుదలను కలిపితే వచ్చే మొత్తం ఇది. ఈ లెక్కన చూస్తే నిర్మలా సీతారామన్ సమర్పించే కొత్త బడ్జెట్ దాదాపు 52 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. 2024-25 బడ్జెట్ 48.2 లక్షల కోట్ల మీద కేవలం 7 శాతం ఎక్కువ.
ఈ పరిస్థితుల్లో ద్రవ్యలోటును తగ్గించడం సాధ్యమవుతుందా? గత ఏడాది జీడీపీలో 4.9 శాతంగా ఉన్న ఫిస్కల్ డెఫిసిట్ ను 2025-26 నాటికి 4.5 శాతానికి తగ్గిస్తామని గతంలో ఆర్థిక మంత్రి చెప్పారు. ఆమె కొత్త బడ్జెట్ లెక్కలు చూస్తే ఆ కల నిజమైందా లేదా అన్నది తేలిపోతుంది. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు మేలు చేసేందుకే అభివృద్ధి రేటును కొంత త్యాగం చేయాల్సి వస్తుందని మన ఆర్థిక మంత్రి చాలా సార్లు చెప్పారు. నిజానికి, ఆమె ఇప్పటివరకూ సమర్పించిన ఏడు బడ్జెట్స్ ఈ దేశంలోని పేదలు, అల్పాదాయ వర్గాల ప్రజల జీవితాలపై ఏమైనా సానుకూల ప్రభావం చూపించాయా? లేదనే చెప్పాలి. ఎందుకంటే, దేశంలో సంపన్నులకు, పేదలకు మధ్య అగాధం గత పదేళ్ళలో మరింత పెరిగింది. అసమానతలు దారుణంగా ఉన్నాయి.
దేశంలో రోజుకు రెండు డాలర్లు అంటే 170 రూపాయల సంపాదన కూడా లేని పేదలు 13.4 కోట్ల మంది ఉన్నారు. అంటే, దేశ జనాభాలో దాదాపు పది శాతం మంది ప్రజలు పేదరికంలో అల్లాడుతున్నారు. ప్యూ రీసర్స్ సెంటర్ తాజా నివేదిక చెబుతున్న వాస్తవం ఇది. ఈ రిపోర్ట్ ప్రకారం 116 కోట్ల మంది భారతీయులు రోజుకు 170 నుంచి 850 రూపాయల ఆదాయంతో జీవిస్తున్నారు. అంటే, దాదాపు 5 వేల నుంచి 25 వేల మధ్య ఆదాయంతో బతుకుతున్న వారు ఈ దేశంలో 84 శాతం మంది ఉన్నారు. వీరిని అల్పాదాయ వర్గమని అంటున్నారు. అంటే, దేశంలో 94 శాతం మంది ప్రజలు పేదలు... నిరుపేదలు.
ఇకపోతే, 25 వేల నుంచి 50 వేల ఆదాయం ఉన్నవారిని మనం మధ్యతరగతి అంటున్నాం. వారి సంఖ్య 6.6 కోట్లు మాత్రమే. ఇది దేశ జనాభాలో అయిదు శాతానికన్నా తక్కువ. నెలకు 50 నుంచి లక్షా ఇరవై వేల వరకు సంపాదిస్తున్న ఎగువ మధ్యతరగతి జనాభా 1.6 కోట్లు మాత్రమే. ఈ అప్పర్ మిడిల్ క్లాస్ దేశం జనాభాలో 1.2 శాతం మాత్రమే. ఇక నెలకు లక్షా 20 వేలు అంతకన్నా ఎక్కువ సంపాదిస్తున్న వారు 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో 0.1 పర్సెంట్ మాత్రమే... అంటే కేవలం 20 లక్షలు.
ఇంత అభివృద్ధి జరిగింది... దేశ బడ్జెట్ 50 లక్షల కోట్లు దాటింది. దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్స్ దాటిస్తామని చెబుతున్న మోదీ ప్రభుత్వం 94 శాతం పేద, అల్పాదాయ వర్గాల జీవితాల్లో ఏం మార్పు తీసుకువచ్చింది? ఆర్థిక సంస్కరణలు చేపట్టిన ఈ మూడు దశాబ్దాల కాలంలో సృష్టించిన సంపద అంతా ఎవరి ఖజానాలోకి పోయింది?
పీపుల్ రీసర్స్ ఆన్ ఇండియాస్ కన్సూమర్ ఎకానమీ (PRICE) రిపోర్ట్ ప్రకారం 1955తో పోల్చితే 2023లో ధనికులు, పేదల మధ్య అంతరం దారుణంగా పెరిగిపోయింది. 2022-23 నాటికి దేశ ఆదాయంలో 22.6 శాతం సొమ్ము ఒకే ఒక్క శాతం ప్రజల వద్ద పేరుకుపోయిందని వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ 2024లో విడుదల చేసిన రిపోర్ట్ చెబుతోంది. ఆదాయం మాత్రమే కాదు, దేశ సంపదలోనూ 40.1 శాతం ఈ ఒక్క శాతం బడాబాబుల చేతుల్లోనే ఉంది. ఈ దేశంలో లిబరలైజేషన్‌కు ముందు 1991లో డాలర్ బిలియనేర్స్ అంటే దాదాపు వేయి కోట్ల రూపాయలు ఉన్నవారు ఒకే ఒక్కరున్నారు. 2011 నాటికి ఆ సంఖ్య 52కు పెరిగింది. 2022లో వీరి సంఖ్య 162కు పెరిగింది. వీరంతా వేయి కోట్ల నుంచి లక్షల కోట్లకు పడగలెత్తినవారు.
అంటే, ఈ ఎకానమీలో ఎవరు లాభ పడుతున్నారు? ఇది నిజంగా వెల్ఫేర్ ఎకానమీయేనా? ఈ దేశంలోని పన్నుల వ్యవస్థ నిజంగా పేదలు, మధ్యతరగతి వారికి పనికొచ్చేలా ఉందా? 2019 నుంచి దేశంలోని బడా కార్పొరేట్ సంస్థ 3 లక్షల కోట్ల రూపాయల టాక్స్ కన్సెషన్స్ పొందాయి. కార్పొరేట్ శక్తులకు ఇస్తున్న రాయితీల మూలంగా 2012 -13 నుంచి ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయలు కోల్పోయింది.
గత ఏడాది బడ్జెట్ చూస్తే.. ప్రభుత్వ ఆదాయంలో వ్యక్తిగత ఆదాయపన్ను ద్వారా లభించిన ఆదాయం 19 శాతం ఉంటే, కార్పొరేట్ సంస్థల వాటా మాత్రం 17 శాతమే. దేశంలో ఏడాదికి 10 లక్షల రూపాయల కన్నా తక్కువ ఆదాయం ఉన్నవారు 6.22 శాతం ఆదాయపన్ను కంట్రిబ్యూట్ చేస్తున్నారు. 50 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారి వాటా అందులో 76 శాతం.
ఇంతా చేసిన ఇన్ కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ సంఖ్య 8.09 కోట్లు మాత్రమే. అందులో జీరో రిటర్న్ ఫైలింగ్స్ దాదాపు 5 కోట్లు. అంటే, ఈ దేశంలో వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లిస్తున్నవారి సంఖ్య 3.19 కోట్ల మంది మాత్రమే.
అయితే, వీరి నుంచే ప్రభుత్వం కార్పొరేట్ల నుంచి వచ్చే పన్ను కన్నా ఎక్కువ పన్ను పిండుకుంటోంది. 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత 2024-25 వరకు కార్పొరేట్ పన్నులు 2.3 శాతమే పెరిగాయి. కానీ, వ్యక్తిగత ఆదాయ పన్ను మాత్రం 4.5 శాతం పెరిగింది.
2014-15లో కార్పొరేట్ టాక్స్ ఆదాయం 4.28 లక్షల కోట్ల నుంచి 2024-25 నాటికి 10.2 లక్షల కోట్లకు పెరిగింది. అదే, వ్యక్తిగత ఆదాయపన్ను 2.5 లక్షల కోట్ల నుంచి 11.8 లక్షల కోట్లకు పెరిగింది. అంటే, ఈ దేశంలో కార్పొరేట్ల కన్నా వ్యక్తిగతంగా జనం కడుతున్న ఆదాయపన్ను చాలా ఎక్కువ. జీడీపీలో కార్పొరేట్ ట్యాక్సుల వాటా గత పదేళ్ళలో 3.4 నుంచి 3.1 శాతానికి తగ్గింది. కానీ, వ్యక్తిగత ఆదాయ పన్ను వాటా 2.1 నుంచి 3.5 శాతానికి పెరిగింది. 2018 -2023 మధ్య కాలంలో వ్యక్తిగత పన్నుల కలెక్షన్లు ఈ దేశంలో 76 శాతం పెరిగాయి. అదే కార్పొరేట్ పన్నుల మాత్రం 24.45 శాతం దగ్గరే ఉన్నాయి.
ఈ ప్రభుత్వం ఎందుకు వ్యక్తులను ఎక్కువగా టార్గెట్ చేస్తోంది. కార్పొరేట్లకు ఫేవర్ చేసి, స్టాక్ మార్కెట్లను ఉర్రూతలూగించడమే అభివృద్ధి అని మోదీ ప్రభుత్వం భ్రమిస్తోందా? దీనికితోడు, ప్రజల మీద జీఎస్టీ దెబ్బ దారుణంగా పడుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఏది తినాలన్నా, కొనాలన్నా జీఎస్టీ బాదుడేంటని ప్రజలు వాపోతున్నారు. 18 శాతం, 28 శాతం జీఎస్టీ శ్లాబులతో ప్రభుత్వం ప్రతి బిజినెస్‌లో స్లీపింగ్ పార్ట్ నర్ గా మారిందనే విమర్శలు వస్తున్నాయి. పది లక్షల కారు కొంటే అందులో దాదాపు 5 లక్షలు ప్రభుత్వానికే పోతోంది. కారు తయారు చేసిన సంస్థకు ఉండే మార్జిన్, డీలర్‌కు వచ్చే లాభం కన్నా పన్నులు ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
దేశంలో అభివృద్ధి పనులకు పౌరులు పన్నుల చెల్లించాల్సిందే. కాదనడం లేదు. కానీ, ఆ అభివృద్ధి కార్యక్రమాలు పన్ను చెల్లింపుదారులకు ఎంతవరకు లభిస్తున్నాయన్నది ప్రశ్న. ట్యాక్సులు కడుతున్న ప్రజలకు ప్రభుత్వం తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తోందా? గుంతల రోడ్లు కుప్పకూలుతున్న వంతెనలను బహుమానంగా ఇస్తోందా? అసలు విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వం ప్రజలకు సరైన సేవలు అందిస్తోందా?
టాక్స్ శ్లాబ్స్ విషయంలో అభివృద్ధి చెందిన అమెరికా, యూరప్ వంటి దేశాలను అనుసరిస్తున్న మోదీ ప్రభుత్వం, ప్రజలకు సౌకర్యాలు కల్పించే విషయంలో సోమాలియాను అనుకరిస్తోందని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. విద్య మీద బడ్జెట్‌లో రెండున్నర శాతం, ఆరోగ్యం మీద అంతకన్నా తక్కువ ఖర్చు చేస్తున్న మోదీ ప్రభుత్వం 2024 బడ్జెట్ డాక్యుమెంట్‌లో కొత్త పాలసీని ప్రకటిస్తుందా? సంపన్నులు, పేదల మధ్య గ్యాప్ ను తగ్గించేందుకు టాక్స్ సిస్టమ్ లో మార్పులు తెస్తుందా? సోషల్ జస్టిస్... సామాజిక న్యాయం అనే మాటకు బడ్జెట్‌లో న్యాయం చేస్తుందా? సామాజిక న్యాయం అన్నది బడ్జెట్‌లో ప్రతిఫలించాల్సిన మాట మాత్రమే కాదు. అది భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కు.