UAE Golden Visa: భారతీయులకు యూఏఈ బంపర్‌ ఆఫర్‌..23.30 లక్షలు చెల్లిస్తే గోల్డెన్‌ వీసా

UAE Golden Visa: ఈ కొత్త విధానం ద్వారా తొలుత భారత్, బంగ్లాదేశ్ దేశాల పౌరులకు ఈ వీసాల జారీ ప్రారంభించనున్నారు.

Update: 2025-07-07 04:11 GMT

UAE Golden Visa: భారతీయులకు యూఏఈ బంపర్‌ ఆఫర్‌..23.30 లక్షలు చెల్లిస్తే గోల్డెన్‌ వీసా

UAE Golden Visa: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తాజాగా సరికొత్త గోల్డెన్ వీసా విధానాన్ని ప్రకటించింది. ఇప్పటికే స్థిరాస్తులు కొనుగోలు చేసిన వారు, వ్యాపారాల్లో భారీగా పెట్టుబడులు పెట్టినవారికి గోల్డెన్ వీసాలు జారీ చేస్తోన్న యూఏఈ ప్రభుత్వం, తాజాగా నామినేషన్ ఆధారిత వీసా విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.

ఈ కొత్త విధానం ద్వారా తొలుత భారత్, బంగ్లాదేశ్ దేశాల పౌరులకు ఈ వీసాల జారీ ప్రారంభించనున్నారు. ఇందుకోసం భారత్‌లో ‘రయాద్ గ్రూప్’ అనే కన్సల్టెన్సీ సంస్థను అధికారికంగా ఎంపిక చేశారు. ఇప్పటి వరకూ దుబాయ్ గోల్డెన్ వీసా పొందాలంటే కనీసం 20 లక్షల ఏఈడీ (రూ. 4.66 కోట్లు) విలువైన స్థిరాస్తి కొనుగోలు చేయాల్సి ఉండేది.

అయితే, కొత్త నామినేషన్ ఆధారిత విధానంలో కేవలం లక్ష ఏఈడీ (సుమారు రూ. 23.30 లక్షలు) ఫీజు చెల్లించడం ద్వారా జీవితకాల గోల్డెన్ వీసా పొందే అవకాశం కలుగుతుంది. ఈ క్రమంలో వచ్చే మూడు నెలల్లో 5,000 మందికి పైగా భారతీయులు ఈ వీసాలకు దరఖాస్తు చేసుకునే అవకాశముందని వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ సందర్భంగా రయాద్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ రయాద్ కమల్ అయూబ్ మాట్లాడుతూ, ‘‘భారతీయుల కోసం ఇది ఒక సువర్ణావకాశం. దరఖాస్తుదారుల వివరాలను పూర్తిగా పరిశీలిస్తాం. యాంటీ మనీలాండరింగ్, క్రిమినల్ రికార్డులు, సోషల్ మీడియా ప్రొఫైల్స్ వంటి అంశాలను శుద్ధి చేస్తాం’’ అని తెలిపారు.

అలాగే దరఖాస్తుదారులు ఆర్థికం, విజ్ఞానం, స్టార్టప్‌లు, ఉద్యోగ రంగాల్లో యూఏఈకి ఎలా ఉపయోగపడతారన్న దానిపై విశ్లేషణ జరిపి, తదుపరి ప్రభుత్వ అనుమతికి దాఖలు చేస్తామని వివరించారు.

దరఖాస్తుదారులు దుబాయ్‌కు రాకుండా, స్వదేశం నుంచే ఈ గోల్డెన్ వీసాను పొందే అవకాశం ఉందని ఆయనే చెప్పారు. ఆన్‌లైన్ పోర్టల్‌, వన్ వాస్కో కేంద్రాలు, కాల్ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేయవచ్చని సూచించారు.

ఈ వీసా పొందిన వారు తమ కుటుంబ సభ్యులతో పాటు సహాయకులను, డ్రైవర్లను తీసుకురావచ్చు. అలాగే స్థానికంగా వ్యాపారం చేయొచ్చు, ఉద్యోగం పొందవచ్చు. ఈ వీసా జీవితాంతం చెల్లుబాటు అవుతుందని ఆయన్నారు. త్వరలో ఈ పైలట్ ప్రాజెక్టును చైనా సహా మరిన్ని దేశాలకు విస్తరించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

Tags:    

Similar News