తమిళనాడులో సరికొత్త రాజకీయ ముఖచిత్రం!

తమిళనాడులో నూతన శకం ఆరంభమయింది. నూతన ఓటర్లు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చడానికి తమ ఓటును ఆయుధంగా ఉపయోగించడానికి సిద్ధమౌతున్నారు.

Update: 2021-01-23 02:24 GMT

తమిళనాడు 

తమిళనాడులో నూతన శకం ఆరంభమయింది. నూతన ఓటర్లు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చడానికి తమ ఓటును ఆయుధంగా ఉపయోగించడానికి సిద్ధమౌతున్నారు. 2016 డిసెంబర్‌లో జయలలిత మరణంతో తమిళ రాజకీయాలు పెను మార్పులకు లోనయ్యాయి. అప్పటి నుంచి అనేక ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. అక్రమాస్తుల కేసులో శశికళకు 2017లో జైలు శిక్ష పడింది. అప్పటి నుంచి ఆమె బెంగళూర్‌ పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తోంది. నాలుగేళ్ల శిక్షను పూర్తిచేసుకుంది. మరికొన్నిరోజుల్లో ఆమె జైలు నుంచి విడుదల కానుంది.

జయలలిత నెచ్చెలి శశికళ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో పరప్పన అగ్రహారం జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఈనెల 27వ తేదీన ఆమె జైలు నుంచి విడుదల కాబోతున్నారు. జైలు నుంచి విడుదలయ్యాక, శశికళ చెన్నైలోని పోయెస్ గార్డెన్ లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. దీనికోసమే జయలలిత అధికారిక నివాసం వేద నిలయం ఎదురుగా ఉన్న 30వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం నిర్మితమౌతున్నది. అయితే, ఆ భవనం ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నది. దీంతో టి నగర్‌లోని ఓ భవనంలో ఉండేందుకు నిర్ణయించుకున్నారు. అయితే, ఈనెల 27న విడుదల కాబోతున్నశశికళకు భారీగా స్వాగతం పలికేందుకు టీటీవీ దినకరన్ బృందం నిర్ణయించింది. సుమారుగా వెయ్యి వాహనాలతో స్వాగతం పలికేందుకు ప్లాన్ చేస్తున్నారు.

తమిళనాడు ప్రస్తుత రాజకీయ పరిస్థితి..

జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే పార్టీ పరిస్థితి పూర్తిగా అగమ్యగోచరంగా మారింది. జయలలిత తరువాత ఎవరు అనేదానిపై నెలకొన్న సందిగ్ధత వాతావరణం ఆ పార్టీలో అస్థిరతకు దారి తీసింది. ముఖ్యమంత్రి అవుతానన్న తరుణంలో శశికళ జైలుకెల్లింది. ఆ తర్వాత ఆ పార్టీలో అధికార పీటం కోసం ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. EPS, OPSల మధ్య పోరు తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలో టీటీవీ దినకరన్‌ పార్టీని చీల్చి తాను సొంతంగా అమ్మడీఎంకే పార్టీని ఏర్పాటు చేశాడు. పార్టీ అంతర్గత కుమ్మలాటల వల్ల అన్నా డీఎంకే ప్రభుత్వం ఒక పది రోజులైనా మనగలుగుతుందా అని అంతా అనుకున్నారు. కాకపోతే ఆశ్యర్యం కలిగించేలా ప్రభుత్వం నిరాటంకంగా నడుస్తోంది. కానీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే మాత్రం చెప్పడం కష్టం.

మరోవైపు కరుణానిధి తన మరణానికి ముందే తన వారసుడిని ప్రకటించడంతో స్టాలిన్ అన్నీ తానై పార్టీని నడిపిస్తున్నాడు. ఇప్పటికే డీఎంకే పార్టీ సీఎం అభ్యర్ధిగా తమిళనాట సుపరిచితుడయ్యాడు. పార్టీలో బలమైన నేతగా..పార్టీని ఒక్కతాటిపైకి తీసుకొచ్చి నడిపిస్తున్నాడు. అన్నాడీఎంకే పార్టీలోని అంతర్గత విభేదాలను ఉపయోగించుకుని లాభపడాలని స్టాలిన్ భావిస్తున్నాడు. మరోవైపు దినకరన్ సాధ్యమైనంత మంది ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాగడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

తమిళనాడులోకి రాజకీయ పరిస్థితిని నటుడు కమల్‌హాసన్‌ బాగానే అంచనావేసినట్టున్నాడు. రాష్ట్రంలో జయలలిత తరహా పాలనగానీ, కరుణానిధి తరహా పాలనగానీ లేదని పదేపదే చెబుతున్నాడు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొందని అంటున్నాడు. ప్రజల్లో తనకున్న పాపులారిటీని ఓట్ల రూపంలో మార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలంటే తనవల్లే సాధ్యమౌతుందని కమల్ పదేపదే చెబుతున్నాడు.

Tags:    

Similar News