Karnataka: ఢిల్లీకి చేరిన కర్నాటక సీఎం రేస్ పంచాయితీ

Karnataka: నేడు హస్తినకు సిద్ధరామయ్య, డీకే శివకుమార్

Update: 2023-05-15 02:02 GMT

Karnataka: ఢిల్లీకి చేరిన కర్నాటక సీఎం రేస్ పంచాయితీ

Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఎవరికి వారు వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించే దాకా సమైక్యంగా ఉన్నామంటూ ప్రకటించిన నేతల వ్యూహాలు తాజాగా మారిపోయాయి. సీఎం పీఠం దక్కించుకునేందుకు ఎవరికివారుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

మరోవైపు.. ఎవరిని సీఎం చేయాలనేది సీఎల్పీ భేటీలో కొలిక్కి రాలేదు. సిద్దరామయ్య, డీకే పట్టువీడకపోవడంతో ఏకాభిప్రాయం సాధ్యం కాదని ఏఐసీసీ పరిశీలకులు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. సీఎల్పీ భేటీలోనే ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకోవాలని సిద్దరామయ్య పట్టుబట్టగా, అధిష్ఠానం నిర్ణయం కూడా తీసుకోవాలని డీకే కోరడంతో.. సీఎం రేసు టాపిక్ ఢిల్లీకి చేరింది. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సూచించే వారే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించనున్నారు. సోనియాగాంధీతోపాటు మల్లికార్జున ఖర్గే కూడా డీకే శివకుమార్‌వైపు మొగ్గు చూపుతారనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే, రాహుల్‌గాంధీ సిద్దరామయ్య పట్ల సానుకూలంగా ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. కాబోయే ముఖ్యమంత్రి అంటూ వేర్వేరుగా వారిద్దరి ఫొటోలతో బెంగళూరులో పోస్టర్లు వెలిశాయి. సిద్దరామయ్య రెండోసారి ముఖ్యమంత్రి అవుతున్నారంటూ ఆయన అభిమానులు పోస్టర్లు ఏర్పాటు చేయగా, రాష్ట్రంలో కాంగ్రెస్‌ విజయసారథి డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి అంటూ ఆయన అభిమానులు పోస్టర్లు వేయడం..చర్చనీయాంశంగా మారింది.

కర్నాటక సీఎం అభ్యర్థిని అధిష్ఠానం ఖరారు చేస్తే ఈనెల 18న ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. సీఎం ఎవరైనా సామాజిక న్యాయం చేసేదిశగా ఇద్దరు లేదా ముగ్గురు ఉపముఖ్యమంత్రులను నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News