Railways Compensation: ట్రైన్ లేటుగా వస్తే ఊరుకోలేదు.. కోర్టుకెక్కి రైల్వే నుంచే ₹9.10 లక్షలు వసూలు చేసిన విద్యార్థిని!
Railways Compensation: భారతీయ రైల్వే శాఖకు ఉత్తరప్రదేశ్ వినియోగదారుల కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది.
Raiways Compensation: ట్రైన్ లేటుగా వస్తే ఊరుకోలేదు.. కోర్టుకెక్కి రైల్వే నుంచే ₹9.10 లక్షలు వసూలు చేసిన విద్యార్థిని!
Railways Compensation: భారతీయ రైల్వే శాఖకు ఉత్తరప్రదేశ్ వినియోగదారుల కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది. రైలు ఆలస్యంగా నడవడం వల్ల ఒక విద్యార్థిని తన విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోవడమే కాకుండా, తీవ్ర మానసిక క్షోభకు గురైందని కమిషన్ నిర్ధారించింది. ఈ మేరకు బాధితురాలికి రూ. 9.10 లక్షల భారీ పరిహారాన్ని చెల్లించాలని రైల్వేను ఆదేశించింది.
అసలేం జరిగిందంటే?
ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాకు చెందిన సమృద్ధి అనే యువతి 2018లో బీఎస్సీ బయోటెక్నాలజీ ప్రవేశ పరీక్షకు సిద్ధమైంది. పరీక్షా కేంద్రం లఖ్ నవూలో ఉండటంతో, సమయానికి చేరుకోవాలని ఆమె ఒక సూపర్‌ఫాస్ట్ రైలులో టికెట్ రిజర్వేషన్ చేసుకుంది.
నిర్దేశించిన సమయం ప్రకారం ఆ రైలు ఉదయం 11 గంటలకే లఖ్ నవూ చేరుకోవాల్సి ఉంది.
కానీ, రైలు తీవ్ర జాప్యంతో మధ్యాహ్నం 1:30 గంటలకు చేరుకుంది.
పరీక్ష మధ్యాహ్నం 12:30 గంటలకే ప్రారంభం కావడంతో, సమృద్ధి పరీక్ష రాయలేకపోయింది.
ఏడేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం
రైల్వే నిర్లక్ష్యం వల్ల తన కెరీర్‌లో ఒక ఏడాది వృథా అయిందని ఆవేదన చెందిన సమృద్ధి, జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. తనకు జరిగిన నష్టానికి రూ. 20 లక్షల పరిహారం కావాలని కోరింది. 2018లో మొదలైన ఈ విచారణ ఏడేళ్ల పాటు సుదీర్ఘంగా సాగింది.
కమిషన్ సంచలన తీర్పు
రెండు వైపులా వాదనలు విన్న వినియోగదారుల కమిషన్, రైలు ఆలస్యం వల్ల విద్యార్థిని నష్టపోయిందని స్పష్టం చేసింది.
పరిహారం: సమృద్ధికి రూ. 9.10 లక్షల పరిహారాన్ని అందజేయాలని ఆదేశించింది.
డెడ్ లైన్: ఈ మొత్తాన్ని 45 రోజుల్లోగా బాధితురాలికి చెల్లించాలని రైల్వే శాఖను ఆదేశించింది.
నిర్దేశిత సమయానికి రైళ్లను నడపడం రైల్వే బాధ్యత అని, అందులో విఫలమై ప్రయాణికులకు నష్టం కలిగిస్తే పరిహారం చెల్లించక తప్పదని ఈ తీర్పు ద్వారా మరోసారి స్పష్టమైంది. ఈ విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.