PM Modi: చిన్నోడా.. నీ ఫోటో నాకు ఇవ్వు, నీకు లేఖ రాస్తా..!

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ కేరళ పర్యటనలో ఒక అరుదైన మరియు హృదయపూర్వకమైన సంఘటన చోటు చేసుకుంది.

Update: 2026-01-23 09:34 GMT

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ కేరళ పర్యటనలో ఒక అరుదైన మరియు హృదయపూర్వకమైన సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం తిరువనంతపురంలో నిర్వహించిన బహిరంగ సభలో తనను చూడటానికి వచ్చిన ఒక చిన్నారిని చూసి ప్రధాని ముగ్ధులయ్యారు. తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపి మరీ ఆ బాలుడితో ముచ్చటించడం సభలో ఉన్న వారందరినీ ఆకట్టుకుంది.

సభలో జనాలు భారీగా తరలిరాగా, ఒక చిన్న బాలుడు ప్రధాని మోదీ స్వయంగా గీసిన డ్రాయింగ్‌ను చేతులతో పైకి ఎత్తి పట్టుకుని చాలా సేపు నిలబడ్డాడు. ఇది గమనించిన మోదీ వెంటనే స్పందించారు. "చిన్నోడా, నువ్వు ఆ ఫోటో పట్టుకుని చాలా సేపు నిలబడ్డావు, అలసిపోతావు. ఆ ఫోటోను నాకు ఇచ్చేయ్. దాని వెనుక నీ చిరునామా రాయి.. నేను నీకు వ్యక్తిగతంగా లేఖ రాస్తాను" అని హామీ ఇచ్చారు.

వెంటనే తన రక్షణ బృందం (SPG) అధికారులను ఉద్దేశించి.. "ఆ బాలుడి నుంచి ఆ ఫోటోను జాగ్రత్తగా తీసుకోండి. అది నాపై ఆ చిన్నారికి ఉన్న ప్రేమకు గుర్తు" అని సూచించారు. దీంతో సభలో చప్పట్ల వర్షం కురిసింది. అదే సమయంలో ఒక మహిళ తాను తెచ్చిన పెద్ద పుస్తకాన్ని చూపించగా.. "ఆమె కూడా నా కోసం ఏదో పెద్ద పుస్తకమే తయారు చేసి తెచ్చారు" అని మోదీ సరదాగా వ్యాఖ్యానించడంతో సభలో నవ్వులు పూశాయి.

రాజకీయ ప్రసంగంలో భాగంగా ప్రధాని మోదీ కాంగ్రెస్, సీపీఐ(ఎం)లపై విరుచుకుపడ్డారు. కేరళలో మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైందని, ఇక్కడ కమల వికాసం ప్రజల ఆశీస్సులతోనే జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేరళ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే పలు రైలు సేవలను, అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించినట్లు మోదీ వెల్లడించారు.

ప్రస్తుతం ప్రధాని మోదీ ఆ చిన్నారిని పలకరించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మోదీకి పిల్లలపై ఉన్న మమకారాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Tags:    

Similar News