జైలులో పరిచయం.. బయట కళ్యాణం: 15 రోజుల పెరోల్‌పై ఖైదీల వివాహం
ప్రేమకు కులం, మతం లేవంటారు.. కానీ ఈ కథలో ప్రేమకు 'జైలు గోడలు' కూడా అడ్డుకాలేకపోయాయి.
ప్రేమకు కులం, మతం లేవంటారు.. కానీ ఈ కథలో ప్రేమకు 'జైలు గోడలు' కూడా అడ్డుకాలేకపోయాయి. వేర్వేరు హత్య కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు జైలులోనే ప్రేమలో పడ్డారు. ఇప్పుడు తమ ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకెళ్లి, న్యాయస్థానం అనుమతితో ఒక్కటి కాబోతున్నారు. రాజస్థాన్‌లోని సంగనేర్ ఓపెన్ జైలులో ఈ వింత ఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రేమ జంటలో ఒకరు ప్రియా సేథ్ కాగా, మరొకరు హనుమాన్ ప్రసాద్. ప్రియా సేథ్ 2018లో డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ఓ యువకుడిని కిడ్నాప్ చేసి, డబ్బు కోసం తన ప్రియుడితో కలిసి హత్య చేసిన కేసులో ఈమె దోషిగా తేలింది. అప్పట్లో ఈ 'సూట్‌కేస్ హత్య' సంచలనం సృష్టించింది. హనుమాన్ ప్రసాద్ 2017లో ఒక వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకుని, ఆ బంధానికి అడ్డుగా ఉన్నారని ఆమె భర్త, ముగ్గురు పిల్లలు సహా ఐదుగురిని వేటకొడవలితో నరికి చంపిన కేసులో ఈయన శిక్ష అనుభవిస్తున్నాడు.
సంగనేర్ ఓపెన్ జైలులో వీరు సుమారు ఆరు నెలల క్రితం కలిశారు. అక్కడ ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. శిక్ష అనుభవిస్తూనే జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్న ఈ జంట, వివాహం చేసుకునేందుకు అనుమతి కావాలని రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. వీరి విన్నపాన్ని పరిశీలించిన కోర్టు, మానవతా దృక్పథంతో వివాహ వేడుక కోసం 15 రోజుల పాటు అత్యవసర పెరోల్ మంజూరు చేసింది.
కోర్టు నుంచి పెరోల్ రావడంతో జైలు నుంచి బయటకు వచ్చిన ఈ జంట, నేడు రాజస్థాన్‌లోని అల్వార్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకోనుంది. హత్యానేరం కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు ఇలా ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వివాహం అనంతరం తిరిగి వీరు తమ శిక్షా కాలాన్ని పూర్తి చేసేందుకు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.