మృత్యుంజయ పసికందు: కోతి బావిలో పడేసినా.. ప్రాణాలు కాపాడిన ‘డైపర్’! ఛత్తీస్‌గఢ్‌లో అద్భుతం

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఒక అరుదైన మరియు ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది.

Update: 2026-01-23 11:51 GMT

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఒక అరుదైన మరియు ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. మృత్యువు అంచుల్లోకి వెళ్లిన ఓ 20 రోజుల పసికందు కేవలం తను వేసుకున్న 'డైపర్' వల్ల ప్రాణాలతో తిరిగి వచ్చింది. కోతి లాక్కెళ్లి బావిలో పడేసినా, ఆ పసిప్రాణం చెక్కుచెదరకుండా బయటపడటం ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది.

అసలేం జరిగిందంటే? సియోని జిల్లాలోని ఒక గ్రామంలో ఓ మహిళ తన 20 రోజుల పసికందుతో కలిసి ఇంటి బయట కూర్చుని ఉండగా, ఒక్కసారిగా కోతుల గుంపు దాడి చేసింది. ఈ క్రమంలో ఒక కోతి మహిళ ఒడిలో ఉన్న పసిబిడ్డను బలవంతంగా లాక్కెళ్లింది. భయాందోళనకు గురైన తల్లి, గ్రామస్థులు కేకలు వేస్తూ కోతిని వెంబడించారు. దీంతో కంగారు పడ్డ ఆ కోతి, పక్కనే ఉన్న ఒక బావిలోకి చిన్నారిని విసిరేసి పారిపోయింది.

లైఫ్ జాకెట్‌లా మారిన డైపర్! చిన్నారి బావిలో పడటంతో గ్రామస్థులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. లోతైన బావి కావడంతో అంతా కంగారు పడ్డారు. కానీ, అద్భుతమనేలా ఆ పసికందు నీటిలో మునగకుండా పైనే తేలుతూ కనిపించింది. వెంటనే చిన్నారిని బయటకు తీసి పరీక్షించగా క్షేమంగా ఉన్నట్లు తేలింది. దీనిపై స్థానిక నర్సు రాజేశ్వరి మాట్లాడుతూ.. "పాపకు వేసిన డైపర్ గాలితో నిండి ఉండటం వల్ల అది ఒక 'లైఫ్ జాకెట్'లా పనిచేసింది. దాని వల్లే పాప నీటిలో మునిగిపోకుండా తేలింది. డైపరే ఈ చిన్నారి ప్రాణాలను కాపాడింది" అని వెల్లడించారు.

అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం: ప్రస్తుతం ఆ చిన్నారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అయితే, తమ ప్రాంతంలో కోతులు, అడవి జంతువుల దాడులు విపరీతంగా పెరిగిపోయాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని, ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.

Tags:    

Similar News