Tobacco Ban: పొగాకు ప్రియులకు షాక్: గుట్కా, పాన్ మసాలాలపై ఒడిశా ప్రభుత్వం సంపూర్ణ నిషేధం!

Tobacco Ban: ప్రజారోగ్యాన్ని కాపాడే దిశగా ఒడిశా ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.

Update: 2026-01-22 09:08 GMT

Tobacco Ban: ప్రజారోగ్యాన్ని కాపాడే దిశగా ఒడిశా ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నికోటిన్ కలిగిన పొగాకు ఉత్పత్తులపై సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బుధవారం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.

ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం.. గుట్కా, పాన్ మసాలా, జర్దా, ఖైనీ వంటి ఉత్పత్తుల తయారీ, నిల్వ, విక్రయం మరియు రవాణాపై రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో నిషేధం అమలులోకి రానుంది. ఈ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

ఒడిశాలో పొగాకు వినియోగం ఆందోళనకర స్థాయిలో ఉండటంతో ప్రభుత్వం ఈ అడుగు వేసింది. ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో ఒడిశాలో 42 శాతానికి పైగా పౌరులు సిగరెటేతర పొగాకు ఉత్పత్తులను (Smokeless Tobacco) వాడుతున్నట్లు వెల్లడైంది. ఒడిశాలో పొగాకు వినియోగం జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉండటం అధికారులను విస్మయానికి గురిచేసింది. రాష్ట్రాన్ని పొగాకు రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

పొగాకు ఉత్పత్తుల వల్ల వచ్చే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వ నిర్ణయానికి ప్రజలందరూ సహకరించాలని ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది. ఒడిశాను ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా మార్చేందుకు పౌరుల మద్దతు అవసరమని పేర్కొంది.

Tags:    

Similar News