Nuclear Tests : అభివృద్ధి పేరుతో వినాశనం..అణు పరీక్షలకు 40 లక్షల మంది బలి..సంచలన నివేదిక

అభివృద్ధి పేరుతో వినాశనం..అణు పరీక్షలకు 40 లక్షల మంది బలి..సంచలన నివేదిక

Update: 2026-01-25 08:23 GMT

 Nuclear Tests : అణు పరీక్షల పేరుతో దశాబ్దాలుగా సాగుతున్న విధ్వంసం మానవాళికి తీరని శాపంగా మారింది. 1945 నుంచి 2017 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన అణు విస్ఫోటనాల వల్ల ఏకంగా 40 లక్షల మంది అకాల మరణం చెందారని ఒక సంచలన నివేదిక వెల్లడించింది. ఇది కేవలం మరణాలకు సంబంధించిన అంకె మాత్రమే కాదు, రాబోయే తరాల డీఎన్‌ఏపై పడుతున్న మాయని మచ్చ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అణ్వాయుధాల తయారీలో భాగంగా నిర్వహించే పరీక్షలు ప్రపంచంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని నార్వేజియన్ పీపుల్స్ ఎయిడ్ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. 1945 నుంచి 2017 వరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,400 అణు పరికరాలను పేల్చారు. రష్యా, అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి అగ్రరాజ్యాలతో పాటు భారత్, పాకిస్థాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ పరీక్షల వల్ల విడుదలైన రేడియోధార్మికత గాలిలో, నీటిలో కలిసిపోయి కోట్లాది మందికి క్యాన్సర్, గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులను పంచిపెట్టింది.

ఫ్రెంచ్ పాలినేసియాలో జరిగిన ఒక అణు పరీక్ష వల్ల ప్రభావితమైన హీనమోయురా క్రాస్ అనే మహిళా పార్లమెంటేరియన్ కథ వింటే హృదయం ద్రవిస్తుంది. ఆమెకు కేవలం 7 ఏళ్ల వయసున్నప్పుడు ఫ్రాన్స్ తన ఇంటికి సమీపంలో అణు బాంబును పేల్చింది. ఆ బాంబు వేడికి గాలి విషతుల్యమైంది. ఫలితంగా ఆమె కుటుంబంలోని ముగ్గురికి థైరాయిడ్ క్యాన్సర్ రాగా, 24 ఏళ్లకే ఆమె లుకేమియా బారిన పడింది. "మమ్మల్ని వారు విషం ఇచ్చి చంపారు" అంటూ ఆమె వ్యక్తం చేసిన ఆవేదన అణు పరీక్షల వల్ల బాధితులుగా మారిన లక్షలాది మంది గొంతుకగా నిలిచింది. 1945లో హిరోషిమాపై వేసిన బాంబు కంటే 200 రెట్లు శక్తివంతమైన బాంబులను పరీక్షల పేరుతో అగ్రరాజ్యాలు పేల్చడం గమనార్హం.

ఈ రేడియోధార్మిక ప్రభావం కేవలం ఆ ప్రాంతాలకే పరిమితం కాలేదు. ప్రస్తుతం భూమిపై ఉన్న ప్రతి ఒక్కరి ఎముకల్లోనూ అణు పరీక్షల వల్ల విడుదలైన రేడియోధార్మిక ఐసోటోపులు ఉన్నాయని మానవ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది మన డీఎన్‌ఏను దెబ్బతీసి, పుట్టుకతోనే వచ్చే లోపాలకు కారణమవుతోంది. ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలపై దీని ప్రభావం అత్యధికంగా ఉంది. మగవారి కంటే ఆడవారికి రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు 52 శాతం ఎక్కువగా ఉంటుందని ఈ నివేదిక స్పష్టం చేసింది.

దురదృష్టవశాత్తూ.. ఈ పరీక్షలు నిర్వహించిన ఏ దేశం కూడా ఇప్పటివరకు బాధితులకు బహిరంగంగా క్షమాపణ చెప్పలేదు. అంతేకాకుండా, అణు వ్యర్థాలను ఎక్కడ పూడ్చిపెట్టారు, ఆ ప్రాంతాల్లో రేడియేషన్ స్థాయి ఎంత ఉందనే వివరాలను ఇప్పటికీ రహస్యంగానే ఉంచుతున్నాయి. బాధితులకు ఇచ్చే నష్టపరిహారం కూడా కేవలం కంటితుడుపు చర్యగానే మిగిలిపోయింది. అణు పరీక్షల కాలం ముగిసిపోయిందని మనం అనుకుంటున్నాం కానీ, ఆ పేలుళ్లు సృష్టించిన విషపు గాలులు నేటికీ మానవాళిని వెంటాడుతూనే ఉన్నాయి.

Similar News