తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోతున్న భక్తులు.. అత్యధిక మంది చనిపోయింది అప్పుడే..!
హిందూ సనాతన ధర్మలో మహా కుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తారు. కుంభమేళా ప్రధానంగా నాలుగు చోట్ల జరుగుతుంది.
తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోతున్న భక్తులు.. అత్యధిక మంది చనిపోయింది అప్పుడే..!
Prayagraj Stampede: హిందూ సనాతన ధర్మలో మహా కుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తారు. కుంభమేళా ప్రధానంగా నాలుగు చోట్ల జరుగుతుంది. హరిద్వార్, ప్రయాగ్ రాజ్, ఉజ్జయిన్, నాసిక్‌లో జరుగుతుంటాయి. ఈ కుంభమేళాలో పాల్గొని పుణ్య స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. అయితే ప్రస్తుతం ప్రయాగ్ రాజ్‌లో మహాకుంభ మేళా జరుగుతోంది. ఈ మహాకుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అయితే ఈ మహాకుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది.
ప్రస్తుతం ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళాకు మౌని అమావాస్య కలిసి వచ్చింది. మౌని అమావాస్య రోజు అమృత స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. దీంతో ప్రయాగ్ రాజ్ కు భారీగా తరలివెళ్లారు. బుధవారం ఒక్కరోజే దాదాపుగా 10 కోట్ల మంది వచ్చినట్లు తెలుస్తోంది. తెల్లవారు జామున భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు ఘాట్ల వద్దకు పరుగులు తీశారు. కొందరు కిందపడిపోగా తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది మరణించారు. వందకు పైగా భక్తులు గాయపడ్డారు.
ఇదేం మొదటి సారి కాదు:
కుంభమేళాల్లో తొక్కిసలాట జరగడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో జరిగిన కుంభమేళాలోనూ తొక్కిసలాట జరిగింది. అనేక మంది భక్తులు మరణించారు.
1954లో మొదటి సారి:
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1954లో తొలి కుంభమేళా జరిగింది. నాడు జరిగిన తొక్కిసలా దేశ చరిత్రలోనే పెను విషాదాల్లో ఒకటిగా నిలిచింది. ఈ ఘటనలో దాదాపుగా 800 మంది ప్రాణాలు కోల్పోగా.. 2 వేల మంది గాయపడ్డారు. ఆ ఘటన కూడా మౌనీ అమావాస్య రోజు చోటుచేసుకుంది. నాడు ఒక ఏనుగు అదుపు తప్పి దూసుకురావడంతో ఈ ఘటన జరిగినట్టు సమాచారం.
1986లో రెండవ సారి:
1986 ఏప్రిల్ 14న కుంభమేళా సందర్భంగా నాటి యూపీ సీఎం వీర్ బహదూర్ సింగ్ తనతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు, పార్లమెంటు సభ్యులను తీసుకొని హరిద్వార్‌లో స్నానాలకు వచ్చారు. ఈ సందర్భంగా రద్దీని నియంత్రించలేకపోయారు. దీంతో తొక్కిసలాట జరిగి 200 మంది ప్రాణాలు కోల్పోయారు.
2003లో మూడోసారి:
2003లో మహారాష్ట్రలోని నాసిక్ లో కుంభమేళా జరిగింది. ఈ సందర్భంగా గోదావరి నదిలో స్నానాలు చేయడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో తొక్కిసలాట జరగడంతో 39 మంది మరణించారు.
20013లో నాలుగో సారి:
2013లో అలహాబాద్‌లో కుంభమేళా జరిగింది. ఈ సందర్భంగా ఫిబ్రవరి 10న తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 42 మంది మరణించారు. ఒక ఫుట్ బ్రిడ్జ్ కూలిపోవడమే దీనికి కారణం.
కుంభమేళాలోనే కాదు.. ఇతర ఆలయాల్లోనూ తొక్కిసలా కారణంగా వందల మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు అవేంటో చూద్దాం.
హాథ్రస్‌లో భోలే బాబా సత్సంగ్:
గతేడాది యూపీలోని హాథ్రస్‌లో భోలే బాబా సత్సంగ్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. పుల్ రాయ్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ క్రమంలో బాబా పాదాల వద్ద ఉన్న మట్టిని తీసుకునేందుకు భక్తులు పోటీ పడడంతో ఈ ప్రమాదం జరిగింది.
రత్నఘడ్ మందిరంలో నవరాత్రి వేళ తొక్కిసలాట:
2013 అక్టోబర్ 13న మధ్యప్రదేశ్‌లోని రత్నఘడ్ మందిరంలో నవరాత్రి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివెళ్లారు. అక్కడ ఓ వంతెన కూలిపోయే ప్రమాదం ఉందంటూ వదంతులు రావడంతో ఒక్కసారిగా భక్తులు పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరగడంతో 115 మంది ప్రాణాలు కోల్పోయారు.
చాముండేశ్వరి దేవి ఆలయంలో తొక్కిసలాట:
2008 సెప్టెంబర్ 30న రాజస్థాన్‌లోని చాముండేశ్వరి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 224 మంది ప్రాణాలు కోల్పోగా.. 420 మందికి పైగా గాయపడ్డారు.
నయనాదేవి ఆలయంలో తోపులాట:
2008 ఆగస్టులో హిమాచల్ ప్రదేశ్‌లోని నయనాదేవి ఆలయంలో తొక్కిసలాట కారణంగా 145 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కొండచరియలు విరిగిపడతాయనే వదంతులే తొక్కిసలాటకు కారణమని గుర్తించారు.
మంధరదేవి ఆలయంలో తొక్కిసలాట:
2005లో మహారాష్ట్రలోని మంధరదేవి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. అప్పుడు ఆలయానికి వెళ్లే మెట్లు జారుడుగా ఉండడంతో ఒక్కసారిగా జనం ఒకరిపై ఒకరు పడ్డారు. కాగా ఈ ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు.