Southwest Monsoon 2020: దేశమంతటా నైరుతి రుతుపవనాలు.. 2013 తర్వాత తొలిసారి

Southwest Monsoon 2020: నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించినట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది.

Update: 2020-06-27 03:11 GMT

Southwest Monsoon 2020: నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించినట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రుతుపవనాలు ముందుగానే విస్తరించడం వల్ల ఖరీఫ్ సాగు అనుకున్న సమయానికి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. జులై 8వ తేదీ నాటికి విస్తరించాల్సి ఉండగా ఈ ఏడాది 12 రోజుల ముందుగానే దేశమంతటా విస్తరించడం శుభపరిణామం. రుతుపవనాలు 26 రోజుల్లోనే చిట్టచివరి ప్రాంతం రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌కు చేరుకున్నాయి.

కాగా.. 2015లోనూ జూన్ 26 నాటికే దేశమంతటా రుతుపవనాలు విస్తరించాయి. అయితే, 2013 తర్వాత వేగంతో నైరుతి దేశంలోని చిట్టచివరి ప్రాంతానికి చేరడం ఇదే తొలిసారి. గత 13ఏళ్లలో నైరుతి రుతుపవనాలు జూన్ 26కి ముందు విస్తరించడం 2013లో ఒక్కసారే జరిగింది. దేశంలోని పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లోని మిగతా ప్రాంతాలకు శుక్రవారం నాటికి రుతుపవనాలు విస్తరించినట్టు ఐఎండీ తెలిపింది. ఇటీవల కాలంలో నైరుతి రుతుపవనాలు అత్యంత చురుకుగా ఉండటం ఇదే మొదటిసారి.. ఈ ఏడాది మాత్రం ఎక్కడా ఎక్కువ కాలం రుతుపవనాలు ఆగిపోకుండా విస్తరించాయి అని ఐఎండీ విభాగం అధికారి శివానంద్ పాయ్ అన్నారు.

హిమాలయ పర్వతాల మీదుగా ఢిల్లీ సహా ఉత్తర భారతమంతా మైదానాలకు నైరుతి రుతపవనాలు విస్తరించాయని.. కొద్ది రోజులు వర్షాలు పడవని చెప్పారు. అయితే, ఈ ఏడాది జూన్‌లో సాధారణం కంటే 22 శాతం అధికంగా వర్షపాతం నమోదయ్యిందని అన్నారు. బంగాళాఖాతంలోని పరిస్థితులు రుతుపవనాల సకాలంలో విస్తరించడానికి దోహదపడ్డాయి. మే మధ్యలో అంపన్ తుఫాను అండమాన్ నికోబార్ దీవుల్లో రుతుపవనాల కదలికలకు సహకరించిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News