దాదా పొలిటికల్‌ ‌ఎంట్రీ ..? వేడెక్కిన పశ్చిమ బెంగాల్‌ రాజకీయం

తృణమూల్‌ కాంగ్రెస్‌తో పాటు భారతీయజనతా పార్టీ సైతం ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

Update: 2020-12-28 11:54 GMT

పశ్చిమ బెంగాల్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. మరో ఆరు మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్ననేపథ్యంలో అన్ని పార్టీల నేతల వరుస పర్యటనలతో బీజీబీజీగా గడుపుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్‌ షా బెంగాల్లో పర్యటించారు. అక్కడ తృణమూల్‌ కాంగ్రెస్‌తో పాటు భారతీయజనతా పార్టీ సైతం ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇరు పార్టీల నేతలు విజయమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనుహ్య ఫలితాలను రాబట్టి టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి షాకిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఇతర పార్టీ ముఖ్య నేతలకు గాలం వేస్తుంది.

ఈ క్రమంలోనే టీమిండియా మాజీ ఆటగాడు, బీసీసీఐ అధ్యక్షుడు‌ సౌరబ్‌ గంగూలీ విషయం దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చకు దారితీస్తోంది. ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జగదీప్‌ దన్‌కర్‌తో సౌరబ్‌ గంగూలీ భేటీ కలకలం రేపుతోంది. రానున్న శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరుఫున దాదా పోటీ చేస్తారని, అతన్ని సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటిస్తారని రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దాదా పోటీ చేయకపోతే ఆయన భార్యను పోటీకి దింపుతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే గంగూలీ మాత్రం ఈ వార్తలను ఖండించారు. బెంగాల్ గవర్నర్‌ జగదీప్‌ దన్‌కర్‌తో భేటీలో ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదని చెప్పుకొచ్చారు. ప్రతిష్టాత్మక ఈడెన్‌ గార్డెన్‌ మైదానాన్ని సందర్శించాల్సిందిగా కోరినట్లు వెల్లడించారు. ఈడెన్‌ను సందర్శిస్తానని గవర్నర్ పేర్కొన్నారు.

Tags:    

Similar News