Congress: అధ్యక్షురాలుగా కొనసాగనున్న సోనియా గాంధీ

Congress: తాము త్యాగాలకు సిద్ధమన్న సోనియా గాంధీ

Update: 2022-03-14 01:15 GMT

అధ్యక్షురాలుగా కొనసాగనున్న సోనియా గాంధీ 

Congress: సోనియా గాంధీనే మరికొద్ది రోజులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగనున్నారు. సంస్థాగత ఎన్నికల వరకు ఆమె ఆధ్వర్యంలో పార్టీ ముందుకు సాగనుంది. ఆదివారం సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. సుమారు నాలుగు గంటలకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు, అధ్యక్ష ఎన్నికపై చర్చించారు. సీడబ్ల్యూసీ సమావేశానికి సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, చిదంబరంతో పాటు అసమ్మతి నేతలు గులాం నబీ ఆజాద్, మనీష్ తివారి, ఆనంద్ శర్మ కూడా హాజరయ్యారు.

ఐదు రాష్ట్రాల్లో ఓటములకు గల కారణాలను భేటీలో ప్రధానంగా చర్చించారు. బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో పార్టీ విఫలమైందని సమావేశం అభిప్రాయ పడింది. పంజాబ్ సీఎం మార్పు తర్వాత తీసుకోవాల్సిన చర్యల అమలు చేయడంలో పార్టీ విఫలమైందని నేతలు ప్రస్తావించారు. లోపాలను సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. పార్టీ బలోపేతం, రోడ్ మ్యాప్‌పై కాంగ్రెస్ పార్టీ సమగ్ర ఆలోచనా శిబిరాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

అయితే గాంధీ కుటుంబం వల్లే కాంగ్రెస్ పార్టీ బలహీనం అవుతోందని భావిస్తే తాము ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని సోనియా గాంధీ ప్రకటించారు. రాహుల్ గాంధీ ప్రజలకు మరింత దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉందని కొందరు సీనియర్ నేతలు సూచించారు. కెప్టెన్ అమరీందర్‌ సింగ్‌ను మార్చడం వల్ల పంజాబ్‌లో నష్టం జరిగిందని మరికొందరు అభిప్రాయపడ్డారు. సోనియాను పార్టీని ముందుండి నడిపించాలని కమిటీ నిర్ణయించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. రాజీవ్‌ గాంధీ జయంతి ఆగస్టు 20వ తేదీన కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందన్నారు. అలాగే పార్లమెంట్‌ సమావేశాలు ముగిసిన వెంటనే రాజస్తాన్‌ రాజధాని జైపూర్‌లో చింతన్‌ శిబిర్‌ నిర‍్వహించబోతున్నట్టు తెలిపారు.

Tags:    

Similar News