Sonia Gandhi: సోనియా గాంధీకి కోర్టు నోటీసులు..!

Sonia Gandhi: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి సంబంధించి రౌజ్ అవెన్యూలోని సెషన్స్ కోర్టు మంగళవారం (డిసెంబర్ 9, 2025) నోటీసులు జారీ చేసింది.

Update: 2025-12-09 09:05 GMT

Sonia Gandhi: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి సంబంధించి రౌజ్ అవెన్యూలోని సెషన్స్ కోర్టు మంగళవారం (డిసెంబర్ 9, 2025) నోటీసులు జారీ చేసింది. భారత పౌరసత్వం పొందే కంటే ముందే ఆమె పేరును ఓటరు జాబితాలో చేర్చారనే ఆరోపణలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

పిటిషనర్ తరఫు న్యాయవాది పవన్ నారంగ్ కోర్టులో వాదనలు వినిపిస్తూ.. సోనియా గాంధీకి పౌరసత్వం రాకముందే ఆమె పేరును ఓటరు జాబితాలో చేర్చడం కోసం కొన్ని అవకతవకలకు పాల్పడి ఉండవచ్చని ఆరోపించారు.

1980లో ఓటరు జాబితాలో పేరు కోసం నకిలీ పత్రాలు సృష్టించారని అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆమె పేరును తొలగించి, మళ్లీ 1983లో తిరిగి చేర్చారని తెలిపారు. ఈ రెండు సంఘటనలు కూడా సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందే కంటే ముందే జరిగాయని, దీనికి సంబంధించిన ఆధారాలను సమర్పించారు. ఈ అంశంపై పునఃపరిశీలన అవసరమని న్యాయవాది కోరారు.

ఈ వాదనలు, ఆధారాలను పరిశీలించిన సెషన్స్ కోర్టు, ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిందిగా సోనియా గాంధీతో పాటు ఢిల్లీ పోలీసులకు కూడా నోటీసులు జారీ చేసింది. గతంలో ఇదే అంశంపై మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు కాగా, ఆమె ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించారని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పిటిషనర్ కోరారు. అయితే, మెజిస్ట్రేట్ కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ తిరస్కరణను సవాల్ చేస్తూ పిటిషనర్ సెషన్స్ కోర్టులో సవాల్ చేయడంతో తాజాగా ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసుపై తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 6న జరగనుంది.

Tags:    

Similar News