Union Budget of India: చరిత్రలో నిలిచిన కొన్ని బడ్జెట్‌లు...

Union Budget of India: బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు.

Update: 2022-01-31 10:41 GMT

Union Budget of India: చరిత్రలో నిలిచిన కొన్ని బడ్జెట్‌లు

Union Budget of India: బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఇక పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మాలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గతంలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్లపై చర్చ జరుగుతోంది. ఫలానా బడ్జెట్‌ బాగుంది.. ఈ బడ్జెట్‌ ఇలా ఉందంటూ నిపుణులు చర్చించుకుంటున్నారు.

స్వతంత్ర భారతంలో తొలి బడ్జెట్‌ 1947 నవంబరు 26న అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఆర్‌కే షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టారు. నాటి నుంచి ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ వరకు ఎన్నో కీలకమైన మార్పులు జరిగాయి. వాటిలో కొన్ని మాత్రం ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.

1973లో ఇందిరా గాంధీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను బ్లాక్‌ బడ్జెట్‌గా పిలుస్తారు. అప్పట్లో దేశం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలకు గురై ద్రవ్యలోటు 550 కోట్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి యశ్వంత్‌రావు బి చవాన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

1986లో వీపీ సింగ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ మోదం, ఖేదం అన్నట్టుగా ఉంది. బడ్జెట్‌లో వినియోగదారులకు ప్రోత్సాహకాలు.. పన్ను ఎగవేత దారులపై వడ్డనలు భారీగా పడ్డాయి. 1986 బడ్జెట్‌ను క్యారెట్‌ అండ్‌ స్టిక్‌ బడ్జెట్‌గా పిలుస్తారు.

1991లో పీవీ నరసింహారావు హయాంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ చారిత్రకమైనదిగా పిలుస్తారు. అప్పటి ఆర్థిక శాఖమంత్రి, ప్రస్తుత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ బడ్జెట్‌ను రూపొందించారు. ఇందులో ప్రధానంగా సరళీకరణలకు ఆహ్వానం పలుకుతూ లైసెన్స్‌ రాజ్‌కు ముగింపు చెప్పింది.

1997 మన్మోహన్‌సింగ్‌ హాయాంలో పి.చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను కలల బడ్జెట్‌గా చెబుతారు. ఈ బడ్జెట్‌లో పన్ను రేట్లను భారీగా తగ్గించారు. కస్టమ్స్‌ సుంకాన్ని కూడా తగ్గించి మరింత సరళీ కృతం చేశారు. వసూళ్లను పెంచేందుకు లాఫర్‌ కర్వ్‌ సూత్రాన్ని వినియోగించారు చిదంబరం.

2000లో వాజ్‌పేయి హాయంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను మిలేన్నియమ్‌ బడ్జెట్‌ అంటారు. ఐటీ రంగ పరిశ్రమ అభివృద్ధికి ఈ బడ్జెట్‌ ఊతమిచ్చింది. ప్రపంచంలోనే భారత్‌ మేటిగా నిలబడానికి నాటి పునాదులే కారణమని నిపుణులు చెబుతారు. 2002లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను రోల్‌బ్యాక్‌ బడ్జెట్‌గా పేర్కొంటారు. పలు ప్రతిపాదనలు ఈ బడ్జెట్‌లో ఉపసంహరించుకోవడంతో దీనికి ఈ పేరు వచ్చేంది.

2021లో మోదీ హాయాంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను వందేళ్లకోసారి వచ్చే బడ్జెట్‌గా అభివర్ణిస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ పుంజుకునేలా చేసేందుకు పలు ప్రతిపాదనలను నిర్మల తీసుకొచ్చారు. మౌలిక, ఆరోగ్య సంరక్షణలో పెట్టుబడులు, ప్రైవేటైజేషన్‌ వ్యూహం, పన్ను వసూళ్ల పెంపు పలు ప్రతిపాదనలు చేశారు.

దేశంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని అందరూ ఆశిస్తున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగాల సృష్టి, వృద్ధి ఆధారిత పెట్టుబడులు బడ్జెట్‌లో ప్రకటించొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్‌ను బూస్టర్‌ బడ్జెట్‌ అని పిలుస్తున్నారు.

Tags:    

Similar News