ఛాయ్ దుకాణం, బాలీవుడ్‌తో లింక్స్, ప్రియురాలికి 3 కోట్ల విలువైన బంగ్లా గిఫ్ట్!

Update: 2025-02-05 06:50 GMT

ఛాయ్ దుకాణం, బాలీవుడ్‌తో లింక్స్, ప్రియురాలికి 3 కోట్ల విలువైన బంగ్లా గిఫ్ట్.. ఎవరీ సంగయ్య స్వామి?

Serial thief Panchakshari Sangayya Swamy's real story: నడిపేది ఛాయ్ దుకాణం. కానీ నాలుగు రాష్ట్రాల పోలీసు రికార్డుల్లో ఆయనొక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఒక్కటి కాదు రెండు కాదు.. ఏకంగా 200 చోరీ కేసుల్లో నిందితుడు... సౌత్ ఇండియా టు నార్త్ ఇండియా నెట్వర్క్ ఉన్న సీరియల్ థీఫ్. పేరు పంచాక్షరి సంగయ్య స్వామి. ఇళ్లలోకి దూరి చోరీలు చేయడం అతడికి ఉన్న మరో ఫుల్ టైమ్ జాబ్.

అలా చోరీలు చేసిన సొమ్ముతో తన ప్రియురాలికి 3 కోట్ల రూపాయల ఖరీదైన బంగ్లా కూడా కొనిచ్చాడు. 2016 లో ఒక చోరీ కేసులో గుజరాత్ పోలీసులకు పట్టుబడి జైలుకు కూడా వెళ్లొచ్చాడు. కానీ చోరీలు చేయడం మాత్రం ఆపలేదు. కానీ తాజాగా ఓ చోరీ కేసులో బెంగళూరు పోలీసులకు దొరికిపోయాడు. 400 గ్రాముల బంగారం, వెండి చోరీ కేసులో సంగయ్య స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు.

స్వామి వద్ద నుండి 180గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. తనతో పాటు ఈ చోరీలో పాల్గొన్న తన పార్ట్‌నర్ వద్ద మిగతా బంగారం, వెండి ఉందని చెప్పాడు. ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఆ వ్యక్తి కోసం బెంగుళూరు పోలీసులు గాలిస్తున్నారు.

సంగయ్య స్వామి స్వస్థలం మహారాష్ట్ర షోలాపూర్ గా తెలుస్తోంది. షాలాపూర్‌లో తల్లి ప్రభుత్వ ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. సంగయ్య స్వామి పేరు చెబితే చాలు... మహారాష్ట్ర పోలీసులు ఎవరైనా ఇట్టే గుర్తుపట్టేస్తారు. అంతేకాదు... స్వామి నేరచరిత్ర ఏంటనేది కూడా గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తారు. అక్కడ ఈ సీరియల్ థీఫ్‌కు ఉన్న పోలీస్ ఫాలోయింగ్ అలాంటిది. ఎందుకంటే... మహారాష్ట్ర పోలీసులు ఇప్పటికే ఎన్నోసార్లు స్వామిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అవడం, రిలీజై బయటికొచ్చాకా మళ్లీ చోరీలు చేయడం ఈ సంగయ్య స్వామికి ఫుల్ టైమ్ జాబ్ అయిపోయింది.

బాలీవుడ్ లోనూ కొంతమంది సినిమా వాళ్లతో సంగయ్య స్వామికి మంచి సంబంధాలు ఉన్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. వారికి ఖరీదైన గిఫ్టులు ఇవ్వడం, ఖరీదైన లైఫ్ ఎంజాయ్ చేయడం అలవాటు పడిన దొంగ.

తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌లో అనేక చోరీ కేసులలో సంగయ్య స్వామి వాంటెడ్ క్రిమినల్ అని తెలుస్తోంది.

తాజాగా బెంగళూరు పోలీసులు సంగయ్య స్వామి గురించి మాట్లాడుతూ, 2010లో స్వామి చివరిసారిగా బెంగుళూరులో చోరీలు చేసినట్లు చెబుతున్నారు. ఆ తరువాత బెంగుళూరులో అతడి కదలికలు లేవని, తన స్నేహితుడు ఇచ్చిన సలహా మేరకే మళ్లీ ఇక్కడికి వచ్చాడని అంటున్నారు. 

Tags:    

Similar News