క్రెడిట్ కార్డ్ బిల్లు కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? బ్యాంకుపై కస్టమర్ ఆగ్రహం

SBI credit cards: దురుసుగా మాట్లాడిన ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కలెక్షన్ ఎగ్జిక్యూటీవ్... తరువాత ఏం జరిగిందో మీరే చూడండి

Update: 2025-02-20 14:25 GMT

దురుసుగా మాట్లాడిన ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కలెక్షన్ ఎగ్జిక్యూటీవ్... తరువాత ఏం జరిగిందో మీరే చూడండి

SBI executive's rude phone call: క్రెడిట్ కార్డు బిల్లులు వసూలు చేసే క్రమంలో బ్యాంకులు కస్టమర్లతో మాట్లాడే పద్ధతిలో సరిహద్దులు దాటుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మొదట వారే వెంటపడి మరీ క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్ ఇస్తారని.. కానీ ఆ తరువాత ఏ కారణం చేతయినా వాటిని తిరిగి కట్టడంలో ఏ మాత్రం ఆలస్యమైనా బ్యాంకులు కస్టమర్లపై వేధింపులకు దిగుతున్నాయనే ఆరోపణలు ఇవాళ కొత్త కాదు. కొన్నిసార్లు బ్యాంకుల కలెక్షన్ ఎగ్జిక్యూటీవ్స్ ఉపయోగించే బాష తట్టుకోలేక కస్టమర్లు తనువు చాలించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి తనకు వచ్చిన ఓ మెసేజ్‌ను రతన్ థిల్లాన్ అనే ఒక కస్టమర్ ఎక్స్ ద్వారా (గతంలో ట్విటర్) నెటిజెన్స్‌తో షేర్ చేసుకున్నారు. కేవలం 2000-3000 క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులో ఆలస్యమైనందుకు చాలా పెద్ద పెద్ద మాటలతో తనని అవమానించారని రతన్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. బ్యాంక్ తనకు క్షమాపణలు చెప్పాలని ఆయన పట్టుబట్టారు. అంతేకాదు.. తన కుటుంబంలో ఎన్ని ఎస్బీఐ ఖాతాలు ఉన్నాయో అవన్నీ ఇవాళే క్లోజ్ చేయించానని చెప్పారు. ఎస్బీఐ కస్టమర్లతో వ్యవహరించే తీరు ఇదేనా అని ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులను నిలదీశారు.

సోషల్ మీడియాలో రతన్ చేసిన ట్వీట్ వైరల్ అవడంతో ఎస్బీఐ కస్టమర్ కేర్ విభాగం స్పందించక తప్పలేదు. ఆయనకు క్షమాపణలు చెప్పిన ఎస్బీఐ... త్వరలోనే మీ సమస్యను పరిష్కరించేందుకు బ్యాంక్ ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారని తెలిపారు. అయినప్పటికీ రతన్ థిల్లాన్ ఆగ్రహం చల్లారలేదు.

ఇంకా మీతో సంప్రదింపులు చేయడం తనకిష్టం లేదని రతన్ రిప్లై ఇచ్చారు. ఎందుకంటే మీ ఎగ్జిక్యూటీవ్ ఫోన్‌లో నాతో మాట్లాడుతూ "పేమెంట్ చేయకపోవడానికి మీకు సిగ్గులేదా" అని అన్నారు. ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ కూడా నా వద్ద ఉంది అంటూ రతన్ ఎస్బీఐకి బదులిచ్చారు. మొత్తానికి ఎస్బీఐకి, రతన్‌కు మధ్య ఎక్స్ వేదికగా జరిగిన ఈ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

రతన్ చేసిన ట్వీట్‌కు వేల మంది నెటిజెన్స్ స్పందిస్తున్నారు. కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. ఎస్బీఐ కస్టమర్ కేర్ నుండి ఇలాగే ఉంటుందని కొంతమంది రిప్లై ఇస్తున్నారు. ఎస్బీఐ నుండి ఇంతకంటే ఎక్కువ ఏం ఆశించలేమని ఇంకొంతమంది బదులిస్తున్నారు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ విషయంలో తనకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని ఇంకో ఎక్స్ యూజర్ తెలిపారు. మీకు కూడా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉందా? మీకూ ఇలానే జరిగిందా అని ఆరా తీస్తూ ఇంకొంతమంది రియాక్ట్ అవుతున్నారు.

Tags:    

Similar News