TOP 6 NEWS @ 6PM : జానారెడ్డికి కీలక పదవి?
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షి వాచ్ మెన్ రంగన్న మరణించారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మార్చి 5 రాత్రి ఆయన మరణించారు.
జానారెడ్డికి కీలక పదవి?: మరో ఐదు ముఖ్యాంశాలు
1.వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం: రంగన్న మృతిపై కేసు
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షి వాచ్ మెన్ రంగన్న మరణించారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మార్చి 05 రాత్రి ఆయన మరణించారు. రంగన్న మృతిపై అనుమానాలున్నాయని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
2019 మార్చి 15న వైఎస్ వివేకానంద రెడ్డి మరణించారు. తన ఇంట్లోనే వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. ఈ హత్య జరిగిన సమయంలో వివేకానంద రెడ్డి ఇంటికి వాచ్ మెన్‌గా ఉన్న రంగయ్యను సీబీఐ సాక్షిగా చేర్చింది. సీబీఐ అధికారులు ఆయన స్టేట్ మెంట్ కూడా తీసుకున్నారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న రంగయ్యకు పోలీసులు భద్రతను కల్పించారు. వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న రంగయ్యకు భద్రత కారణాల రీత్యా 1+1 భద్రతను కల్పించారు.
రంగన్న మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు
రంగన్న భార్య ఫిర్యాదుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ మురళీ నాయక్ చెప్పారు. వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న రంగన్నకు రక్షణ కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అనారోగ్యంగా ఉన్న రంగన్నను పోలీసులు ఆసుపత్రికి తరలించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. రంగన్న భార్య ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తామన్నారు. రంగన్న మృతిపై సీబీఐ అధికారులకు కూడా సమాచారం ఇచ్చినట్టు ఆయన చెప్పారు.
2.జెలెన్ స్కీ స్వస్థలంపై రష్యా క్షిపణి దాడి: నలుగురు మృతి
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వస్థలం క్రీవి రీహ్‌పై రష్యా క్షిపణితో దాడికి దిగింది. ఓ హోటల్ పై రష్యా చేసిన దాడిలో నలుగురు మరణించారు. ఈ హోటల్ లో అమెరికా, బ్రిటన్ తో పాటు తమ దేశ పౌరులున్నారని ఉక్రెయిన్ తెలిపింది. ఈ ఘటనలో 30 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్ కు అమెరికా సాయం నిలిచిపోయింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు, జెలెన్ స్కీ మీడియా ముందే గొడవకు దిగారు. ఈ ఘటనపై ఆ తర్వాత జెలెన్ స్కీ విచారం వ్యక్తం చేశారు.
3.హకీంపేట భూసేకరణ నోటిఫికేషన్ పై స్టే
హకీంపేట భూసేకరణ నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ శివకుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భూసేకరణను రద్దు చేయాలని ఆయన కోరారు. నోటిఫికేషన్ రద్దు చేసేవరకు స్టే విధించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టును అభ్యర్ధించారు. 2024 నవంబర్ 29న భూసేకరణపై నోటిఫికేషన్ జారీ చేసిన రేవంత్ రెడ్డి సర్కార్. ఇండస్ట్రీయల్ పార్క్ కోసం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఇందులో భాగంగా హకీంపేటలో 351 ఎకరాలను సేకరించనున్నారు. ఈ భూసేకరణను పిటిషనర్ వ్యతిరేకించారు. 2013 భూసేకరణ చట్టం మేరకు చెల్లించడం లేదని పిటిషనర్ వాదించారు.కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో ఫార్మా ఇండస్ట్రీస్ కోసం ప్రభుత్వం 2024 జూన్ 7న నోటిఫికేషన్ జారీ చేసింది. లగచర్ల, హకీంపేట, పోలేపల్లిలో 1358 ఎకరాల భూసేకరించాలని తలపెట్టారు. పట్టా, అసైన్డ్ భూములను సేకరించాలని అప్పట్లో ప్రభుత్వం భావించింది. పోలేపల్లిలో 71 ఎకరాలు, లగచర్లలో 632 ఎకరాలను భూసేకరణకు అప్పట్లో అధికారులు అనుమతి ఇచ్చారు.
4.చంద్రబాబుతో వైరం నిజమే: దగ్గుబాటి వెంకటేశ్వరరావు
చంద్రబాబుతో వైరం ఉందని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, దగ్గుబాటి పురంధేశ్వరి, విశాఖ ఎంపీ భరత్ తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ చరిత్ర పుస్తకం రాయడానికి దారి తీసిన పరిస్థితులను వెంకటేశ్వరరావు వివరిస్తున్న క్రమంలోనే చంద్రబాబు గురించి మాట్లాడారు. చంద్రబాబుతో తనకు వైరం ఉందని అంటుంటారని అది నిజమేనని ఆయన అన్నారు. ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు కదా.. గతంలో జరిగినవాటిని మర్చిపోతూ ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. భవిష్యత్తు ఆశాజనకంగా ఉండాలని దగ్గుబాటి ఆకాంక్షను వ్యక్తం చేశారు. అయితే తనకు ఎలాంటి కోరికలు కూడా లేవని ఆయన అనగానే అందరూ నవ్వారు. తన కుటుంబం, తన పిల్లలు, స్నేహితులతో కలిసి క్షేమంగా ఉండాలనేది కోరిక అని ఆయన చెప్పారు.
1995లో టీడీపీ సంక్షోభం సమయంలో చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒక వైపున ఉన్నారు. ఆ తర్వాతి పరిణామాల్లో చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు మధ్య అంతరం పెరిగింది. ఆ తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీకి గుడ్ బై చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్‌సీపీలలో చేరారు. 2023లో క్రియాశీల రాజకీయాలకు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గుడ్ బై చెప్పారు.
5.జానారెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ
మాజీ మంత్రి జానారెడ్డితో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. జానారెడ్డితో అరగంటకు పైగా సమావేశమయ్యారు. ఈ సమావేశం ముగించుకొని ఆయన నేరుగా సెక్రటేరియట్ కు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో జానారెడ్డి భేటీ అయ్యారు. ప్రభుత్వ పెద్దలు అడిగితే సలహాలు ఇస్తానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఈ వ్యాఖ్యలు చేసిన మరునాడే జానారెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుడిగా జానారెడ్డిని అపాయింట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.
6.పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
సినీ నటుడు పోసాని కృష్ణ మురళి కస్టడీ పిటిషన్ పై ఆదోని కోర్టులో విచారణ జరిగింది. రిమాండ్ లో ఉన్న ఆయనను కస్టడీకి ఇవ్వాలని ఆదోని మూడో టౌన్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరో వైపు తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పోసాని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ తో పాటు కస్టడీ పిటిషన్లపై కోర్టు మార్చి 7న తీర్పును వెల్లడించనుంది.